Saturday 3 December 2011

'కార్యేషు దాసుడు'

సికింద్రాబాద్ నుండి పాలకొల్లు వరకు  నర్సాపూర్   express  లో ప్రయాణం చేస్తున్నాను. నాకు మొదట్నించి రిజర్వేషన్ బోగీలో ప్రయాణం చేయడంకంటే జనరల్ బోగీలోనే ప్రయాణం చేయడం ఇష్టం. కొన్నికొన్ని అసౌకర్యాల గురించి మర్చిపోతే అక్కడ వుండే ప్రయాణీకుల్లో రకరకాల మనుషులను, మనస్తత్వాలను, అభిప్రాయాలను దగ్గర నుండి పరిశీలించే అవకాశం వుంటుంది.ఐపాడ్స్, headphones  వచ్చిన తర్వాత రిజర్వేషన్ బోగీలలో ప్రయాణించే ప్రయాణీకుల మధ్య దూరాలు బాగా పెరిగిపోయాయి. పక్క పక్క బెర్త్ లోనే వున్నప్పటికి ఎవరి ప్రపంచం వారిది. లగేజ్ సర్దగానే హెడ్ ఫోన్స్ పెట్టుకుని ట్రైన్ తో పాటుగా పాటలలోకం లో వూగిపోతుంటారు.ఇవన్నీ అదోరకమైన ఒంటరి ప్రయాణాలు...!

జనరల్ బోగీ కావడంతో కొంచెం రద్దీగానే వుంది. కూరగాయల ధరల నుండి కుంభకోణాల వరకు అసలైన ప్రజానీకం సిసలైన కామెంట్స్ చేస్తున్నారు. వీటన్నిటినీ సావధానంగా పరికిస్తున్న నా కళ్ళు కిటికీ దగ్గర వున్న సింగిల్ సీటర్ పై  ఆగిపోయాయి. అక్కడొక అరుదైన దృశ్యం.

ఇద్దరు భార్యాభర్తలు.. చూస్తుంటే ఆమె అనారోగ్యంతో వున్నట్టుగా వుంది. ఆమె ముఖం చూస్తుంటే ఆ విషయం స్పష్టమవుతుంది.మామూలుగా అయితే ఆ సింగిల్ సీట్ లో  తెలియని వారు సైతం  ఇద్దరు సర్దుకుని కూర్చుంటారు .కానీ ఆ సీట్ లో ఆమె ఒక్కదాన్నే కూర్చోబెట్టి, రెండు సీట్ లకు మధ్య లో వుండే ఖాళీ లో  కింద కూర్చున్నాడు ఆ భర్త. నిజానికి ఆ ఖాళీ జాగా కూడా చాలా డిమాండ్ అక్కడ. జనరల్ బోగీలో ప్రయానించే ఎవరికైనా ఈ విషయం అనుభవమే.ఆమె బాగా నీరసంగా కనిపిస్తుంది. అతని కళ్ళలో కూడా కొంచెం ఆందోళన  కనిపిస్తుంది. ఎప్పుడు ఏం అడుగుతుందో అన్నట్టుగా ఆమె కదిలిన ప్రతిసారి ఆ భర్త ఆమెను ఆరాతీస్తున్నాడు 'ఏం కావాలన్నట్టుగా' .

రైలు వేగం అందుకుంది. వేడి వేడి వాదనలు చల్లారిపోయాయి. చాలా మంది నిద్రలోకి జారుకున్నారు. 'నిద్ర సుఖమెరగదు' అన్న విషయం ఇక్కడ సరిగ్గా సరిపోతుంది. ఉన్నంతలో ఎవరికి వారు నిద్రాదేవత ఒడిలో సర్దుకుపోయారు. నాకు సీట్ దొరకలేదు. నేను కూడా కొంత జాగా దొరికితే కిందే చతికిలబడ్డాను. కొంతసేపటికి ఎవరో toilet  తలుపు వేసినట్టు లేదు. దుర్వాసన ఎక్కువగా వస్తుండటంతో లేచి వెళ్ళి తలుపు వేసి ఆ పక్కనే వున్న డోర్ నుండి బయట ప్రపంచాన్ని చూస్తుండిపోయాను.చీకట్లో అన్నీ అస్పష్టంగా కదులుతున్న ఛాయాచిత్రాలే.కొంతసేపటికి 'ఇక చాలు' అనిపించి మళ్ళీ నేను ఇందాక చతికిలబడ్డ చోటుకి వచ్చాను.

అప్రయత్నంగా ఇందాకటి దృశ్యం గుర్తుకొచ్చి ఆ భార్యాభర్తలు  కూర్చున్న వైపు చూసాను. ఈసారి ఇంకా మనోహరమైన దృశ్యం. ఆమె మగతగా నిద్రపోతుంది. కింద కూర్చున్న భర్త ఆమె పాదాలను తన ఒడిలో పెట్టుకుని వాటిని ఒత్తుతు ఆమెకు  సపర్యలు చేస్తున్నాడు నిద్రపోకుండా. భార్య మాట వింటేనే తన పురుషహంకారం ఎక్కడ తగలడిపోతుందో అనుకునే భర్తేశ్వరులు ఇంకా వున్న ఈ లోకంలో, ఆయన చుట్టూ ఎంత మంది వున్నాపట్టించుకోకుండా ఆమె పాదాలు పట్టుకుని సపర్యలు చేస్తున్నాడు.వెంటనే నాకు ఒకసారి ఆఫీస్ లో కొలీగ్స్ మధ్య  చర్చకు వచ్చిన ఒక విషయం గుర్తుకొచ్చింది..

ఇంతకుముందు టీవిలో ఒక యాడ్ వచ్చేది. కార్ చెడిపోవడంతో ఇంటికి నడిచి వచ్చిన తన భార్య పాదాలను ఒడిలో పెట్టుకుని ఆమె అలసట పోగొడుతూ తన ప్రేమను తెలియజేస్తాడు భర్త. కమర్షియల్ గా ఈ వ్యాపార ప్రకటన కంపెనీకి ఎంత లాభం చేకూర్చిందో తెలియదుకాని. నిజానికి ఇది చాలా  అందమైన ఆలోచన.ఈ యాడ్ వచ్చినప్పుడల్లా మా కొలీగ్ వాళ్ళ అత్తగారు 'మరీ చోద్యం కాకపోతే ఇవేం ముదనష్టపు ఆలోచనలే తల్లీ. ఆ మొగుడనేవాడు కాళ్ళు పట్టుకున్నాడే అనుకో ఆ మహాతల్లి రెండు కాళ్ళు ఇచ్చెయ్యడమే. ఒద్దండీ అని వెనక్కి తీస్కోవడం తెలీదు' అని నోరునొక్కుకునేదట. ఈ విషయం మా కొలీగ్ ఆ యాడ్ వచ్చినన్నాళ్ళు ఏదో ఒక సందర్భంలో చెప్తుండేది.
 
ఇప్పుడు రైలు లో అలాంటి భర్త ప్రత్యక్షంగా తారసపడటం నిజంగా ఒక మంచి అనుభవంగా అనిపించింది నాకు. ఇలా భార్యలకు సపర్యలు చేసే భర్తలు ఇంకెవరూ లేరా అంటే.. ఖచ్చితంగా వుండే వుంటారు.. కానీ వారికి గుర్తింపేది. "కార్యేషు దాసీ..కరణేషు మంత్రీ.." అని అన్నీ స్థానాలు ఆడవారికే ఇచ్చేసారు మన పెద్దలు. కాబట్టి ఇలాంటి వారికోసం ఒక చిన్న మార్పుతో.." కార్యేషు దాసుడు.." అని అనుకుందాము...స్త్రీమూర్తులకు అభ్యంతరం లేకపోతే!

7 comments:

  1. దాసి,దాసుడు లాంటి పదాలు ఎందుకు లెండి. ఒకరి కష్టం ఒకరు తెలుసుకుంటే అది అన్యోన్యదా౦పత్యమే అవుతుంది. చక్కటి విషయాన్నీ పంచుకున్నారు.

    ReplyDelete
  2. జ్యోతిర్మయిగారూ! ఏదో మా మగవారి గుర్తింపుకోసం అలా రాసాను. మీకు నచ్చకపోతే మమ్మల్ని ఒగ్గేయండి.

    ReplyDelete
  3. నచ్చక పోవడమేమిటి చాలా నచ్చేసింది..

    ReplyDelete
  4. నిజమేనండీ. ఒకరి కోసం ఒకరు అన్నట్టు బ్రతకగలిగితే ఎంత బాగుంటుంది. బాగా రాశారు.

    ReplyDelete
  5. @ శిశిరగారూ! కృతజ్ఞతలు.
    @ కొత్తపాళీగారూ! మీరు నా బ్లాగు కి వచ్చి స్పందించినందుకు చాలా సంతోషంగా వుందండి.ఊసులతీరం కు స్వాగతం.

    ReplyDelete
  6. మీరు రాసిన కార్యేషుదాసుడు కాని దాసి ఏదైనా అండర్ స్టాండింగ్ ఉంటే చాలండి.

    ReplyDelete
  7. అవును మీనుగారు. మీరు చెప్పింది ముమ్మాటికి నిజం. మీనుగారూ! మీ బ్లాగు ఇంకా పూర్తిగా సిధ్ధం కానట్టుగా వుంది. త్వరగా బ్లాగుల ప్రపంచంలోకి రావాలని కోరుతూ..ఊసులతీరం తరపున స్వాగతం.

    ReplyDelete