Wednesday, 14 December 2011

నక్కల కాలవ - దెయ్యాలగొడవ

చింతామణి - మా గోపీ మాస్టార్ టపాలో 'నక్కల కాలవ - దెయ్యాలగొడవ' అనే టాపిక్ వచ్చింది. ఈ విషయం గురించి మరో టపాలో వివరిస్తానని చెప్పాను. ఈ నక్కల కాలవ కు సంబందించిన, నేను విన్న దెయ్యం కథ ఒకటి చెప్తాను..!

ఆచంటలో రెండెడ్ల బండి తోలే సానబోయిన కొండయ్య ప్రతి శనివారం పాలకొల్లు నుంచి ఆచంట కిరాణా సరుకులు వేసుకెళ్ళేవాడు.పాలకొల్లు శనివారం సంతంటే చాలా పెద్ద పేరు. అటు దొడ్డిపట్ల నుంచి ఇటు వీరాసరం వరకు, ఇటు కరుగోరుమిల్లి, కందరవల్లి, ఆచంట నుంచి అటు చించినాడ వరకు షావుకారులందరు వారానికి సరిపడా కిరాణా సరుకులన్నీ టోకున కొని ఎడ్ల బళ్ళ  పై వేసుకుని వెళ్ళేవారు. ఆ రకంగా కొండయ్య ప్రతి శనివారం పెద్ద లోడుతో రాత్రిపూట నక్కల కాలవ మీదుగా ఆచంట వెళ్ళడం పరిపాటి.

ఒక శనివారం ఎడ్లకు నాడాలు వేయించే పని పెట్టుకుని రాత్రి బాగా పొద్దుపోయాక కిరాణా లోడుతో బయల్దేరాడు. గుమ్ములూరు మైలు రాయి దాటాక చుట్టూ చిమ్మ చీకటి. అలవాటైన దారి కావడంతో తోలేవారి ప్రమేయం లేకుండానే ఎడ్లు బండిని లాక్కెళ్ళిపోతున్నాయి.కొంచెం సేపట్లో నక్కల కాలవ చేరుకుంటామనగా రోడ్డు పక్కన ఒకతను చెయ్యేత్తి బండి ఆపాడు. అతను కొడమంచిలి పెదబాబుగారి పాలేరు వీరయ్య.
"ఎవరది?" అన్నాడు కొండయ్య
"ఏండి... కొడమంచిలి వరకు ఎల్లాలి. బండి ఎక్కించుకోండే' అన్నాడు.
కొండయ్య సరే అనడంతో టేకు ఆకు చక్రం పై బలంగా కాలెట్టి గెంతి వెళ్ళి బండిలో కూర్చున్నాడు. బండి కదిలింది.

'పెదమల్లం లాస్ట్ బస్సు దాటిపోయిందండే. నడిచెల్లి పోదామని వచ్చేసానుకాని ఇక్కడ కొచ్చాక దైర్యం సరిపోలేదండే కొండయ్యగారా' అని అసలు విషయం చెప్పాడు వీరయ్య. కొండయ్య చిన్నగా నవ్వి ఊరుకుని చుట్ట వెలిగించాడు. చిమ్మచీకట్లో ఎడ్ల గంటల మోత తప్పితే ఏమీ కనిపించట్లేదు, వినిపించట్లేదు. నక్కల కాలవ వచ్చేసింది.

కొండయ్య, వీరయ్య యేవో కబుర్లో పడ్డారు. బండి నక్కలకాల్వ వంతెన ఎక్కింది. వీరిద్దరిలో ఎవరికీ దాని ద్యాస లేదు. వంతెన మధ్యలోకి రాగానే ఎడ్లు కదలడం మానేసి నిలబడిపోయాయి. ఇద్దరు కబుర్లాపి వున్న కూసింత వెలుగులో ఏమయ్యిందా అని చూడసాగారు. ఇద్దరికీ ఏమీ కనిపించలేదుగాని దాపటి ఎద్దు బెరుకుగా వెనక్కి లాగుతుంటే ఎలపటి ఎద్దు మాత్రం కోపంతో బుసలు కొడుతూ కాలు దువ్వుతుంది. తోలుగర్ర పక్కన పడేసి ఏమయ్యిందా అని బండి దిగబోతున్న కొండయ్యని 'కొండయ్యగారా బండి దిగొద్దండి' అని గట్టిగా అరిచాడు వీరయ్య . ఆ అరుపుకు ఉలిక్కిపడిన కొండయ్య వీరయ్య వైపు చూసాడు.

'ఇక్కడ ఇలాంటివన్నీ మామూలే కదండే..తొందరపడితే ఎలాగ' కొండయ్యను వెనక్కి వెళ్లమని వీరయ్య వెళ్ళి బండి తొట్టులో వున్న వట్టి గడ్డిని (ఎండు గడ్డి) చిన్న సైజు కట్టలాగ కట్టి అగ్గిపుల్లతో ఎలిగించి బండి కి ఎదురుగా పడేసి ఎడ్లను అదిలించాడు.ఎడ్లకు దారి కనపడింది కాని వాటి ప్రవర్తనలో మార్పు రాలేదు. అలా నాలుగైదు కట్టలు అంటించి బండి ముందరకు విసిరేస్తూ 'త.... నా సంగతి తేలీదు నీకు.  పాతచెప్పుదెబ్బలు, ఎండు మిరపకాయ్ దూపమేసాననుకో మళ్ళీకోలుకోలేవు.. అడ్డు లెగెహే' అని గాలిలోకి చూస్తూ తిట్టడం మొదలెట్టాడు. ఇప్పటికి ఎడ్లు కొంచెం బెరుకు వదిలి స్థిమితపడ్డాయి. వెనకాల కూర్చున్న కొండయ్య గడ్డి కట్టలు కట్టి ఇస్తుంటే వీరయ్య వాటిని అంటించి బండి ముందరకు విసురుతూ,నోటికొచ్చిన తిట్లు తిడుతూ, ఎడ్లను అదిలిస్తూ మెల్లగా వంతెన దాటించాడు. ఆ నక్కల కాలవ వంతెన దిగగానే అవి ఎలాంటి తత్తరపాటు లేకుండా బండిని లాక్కెళ్ళిపోతున్నాయి. కొండయ్య కి చెమటలు పట్టేసాయి.
కాసేపటికి తేరుకుని 'ఏమయ్యుంటుంది?' అని అడిగాడు కొండయ్య.
'నిన్న పేటలో ఓ కుర్రాడు ఎండ్రిన్ తాగి చచ్చిపోయాడంటండి. ఆడే అయ్యుంటాడు. ఈ రూట్లో వచ్చేటప్పుడు మీరు జాగర్తగా ఉండండి. ఇంటికెళ్ళగానే నాలుగు ఉప్పు కళ్ళు ఎడ్లకు దిష్టి తీసి పొయ్యలో పడెయ్యండి ' అని 'దాపటి దానికింకా దడ తగ్గలేదండే'  అని  నడుం మీద చెయ్యేసి నిమిరాడు. అది తోకతో విదిలించుకుంది.

ఇది కొండయ్యగారు ఆయన స్వీయ అనుభవాన్ని యార్లగడ్డ సుబ్బారాయుడికి  చెప్తుండగా నేను విన్నది.

ఇలాంటి సంఘటన జరిగిందని తెలిసిన దారిలో, అమావాస్య ముందురోజు రాత్రి 11 గంటలకు ఒంటరిగా సైకిల్ మీద వెళ్ళ్తుంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి.. నావరకు అది ఊహకాదు..నిజం.. అలాంటి సమయంలో వున్న నాకు 'నక్కల కాలవ' వంతెన పై ఎదురైన అనుభవం ఏమిటో తదుపరి టపాలో చెప్తాను.

10 comments:

 1. నేను ఆ దోవలో చాలా సంవత్సరాలు రాత్రులేతిరిగానండీ!

  ReplyDelete
 2. @ కస్టెఫలె గారూ! ఇలాంటి అనుభవాలేమి ఎదురవ్వలేదాండీ?
  @ కొత్తపాళీగారూ ! ఘోస్ట్ స్టోరీస్ చెప్పి బ్లాగరులను భయపెట్టనండి. ఇంకొక్కటి చెప్పి ఈ టాపిక్ ఆపేస్తాను.

  ReplyDelete
 3. వావ్ మీ తరువాత టపా కోసం ఆసక్తిగా చూస్తూ ఉంటా!

  ReplyDelete
 4. @ రసజ్ఞగారూ! ఈసారి టపా ఆలస్యం కాకుండా త్వరగా రాసేస్తానండి.

  ReplyDelete
 5. బాలు ఏమనుకోకండి..నాకు దెయ్యాలంటే భయం. మీరు టాపిక్ మార్చాక వస్తాను.

  ReplyDelete
 6. @ అయ్యో జ్యోతిర్మయి గారూ! మిమ్మల్ని భయపెట్టినందుకు మన్నించండి. తొందరలోనే నిర్భయంగా నా బ్లాగుకు వద్దురుగాని.

  ReplyDelete
 7. దాపటి, ఎలపటి, వీరాసరం, ఏండి, వట్టిగడ్డి

  :) ఊరెళ్ళి అరుగు మీద కూర్చుని ఊరోళ్ళ మాటలు వింటున్నట్టుంది. బాగా రాశారు.

  ReplyDelete
 8. శిశిరగారూ! ఉన్న ఊరు, కన్నతల్లి అన్నారు కదండి. వాటి స్పర్శ ఏరూపంలో వున్నా ఆ పీలింగ్స్ చాలా మధురంగా ఉంటాయండి.

  ReplyDelete
 9. లేదండి, అక్కడకొచ్చేటప్పటికి మోటార్ సైకిల్ స్పీడు పెంచి కళ్ళు మూసుకుని కాలవ దాటేసేవాళ్ళం.

  ReplyDelete