Sunday, 11 December 2011

చింతామణి-మా గోపి మాస్టారు

'చిక్కుల్లో చింతామణి' అని టివి9 లో వార్త చూసాను. 'ఈ నాటకం ఒక వర్గం వారిని కించపరిచేలా వుందన్న కారణంగా నాటక  ప్రదర్శనను నిలిపివేయాలని వారు కోరుకుంటున్నారు' అనేది వార్త సారశం. ఇందుకు సంబందించి మిగిలిన విషయాల వైపు వెళ్లకుండా నాకు ఈ వార్త కారణంగా  'చింతామణి' నాటకం గుర్తుచేసిన జ్ఞాపకాల దొంతరలను మాత్రమే ప్రియ బ్లాగరులతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను..!

చింతామణి పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది ఆచంట శివరాత్రి జాతర. మా చిన్నప్పుడు శివరాత్రి ఉత్సవాలకు 'ఆచంట' పెట్టింది పేరు. ప్రతి సంవత్సరం ఐదు రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగేది. మా వరకు ఐతే కాలెండర్ తిరగేస్తు శివరాత్రి ఎప్పుడా అని ఎదురు చూసేవాళ్ళం.

కళ్ళి నాగేశ్వర్రావు కి మహింద్ర ట్రాక్టర్ వుండేది. సాయంత్రం వరకు బంటా పని చేసి (ట్రాక్టర్ తో మట్టి తోలడం లాంటి పనులు) 20 మంది  వరకు కుర్రాళ్ళు  శివరాత్రి రోజు  రాత్రి ఆచంట బయల్దేరేవారు. మేము చిన్నపిల్లలం కాబట్టి ట్రాక్టర్ ట్రక్కులో ఒక మూలన కూర్చునే వాళ్ళం. 

పెనాదం నుండి ఆచంట కు సుమారుగా  పదిహేను కిలోమీటర్ల దూరం వుంటుంది. రాత్రివేళ ప్రయాణం, చుట్టూ దట్టంగా మంచు పట్టేసి ట్రాక్టర్ తోలే డ్రైవర్ కి తప్ప ట్రక్కులో కూర్చున్న వారికి దారి కనిపించేదికాదు. 'గుమ్ములూరు' , 'ఆచంట యేమారం' కి మధ్యలో 'నక్కల కాలవ' అని ఒక పెద్ద కాలవ  వుంది. అది దగ్గరపడుతుందంటే  పిల్లలకే కాదు, పెద్దలకి కూడా భయమే. అక్కడ దెయ్యాలు ఎక్కువగా తిరుగుతాయని, సరిగ్గా వంతెన దాటే సమయంలో కాలవ మధ్యలో వుండగా అవి ఏదో రకంగా ఆ సిమెంట్ వంతెన పై నుండి వెళ్లేవారిని ఇబ్బంది పెడుతూ ఏడిపిస్తాయని కథలు కథలుగా చెప్పుకునేవారు. (నక్కల కాలవ దెయ్యాల కథలను మరో టపాలో వివరంగా చెబుతాను).

ఆచంట రామేశ్వరస్వామి గుడి దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ జాతర చూడడానికి రెండు కళ్ళు సరిపోవంటే నమ్మండి. సాంస్కృతిక కార్యక్రమాలు మొదలవ్వడానికి ఇంకా టైం పడుతుందంటే వేడివేడి జిలేబి, వేడివేడి చికెన్ పకోడి పొట్లం కట్టించుకుని పక్కనే వున్న 'నటరాజ్ దియేటర్'లోనో, 'కళ్యాణ చక్రవర్తి' దియేటర్లోనో సినిమాకి చెక్కెయ్యడం, సరిగ్గా 'చింతామణి' నాటకం మొదలయ్యే సమయానికి బయటకొచ్చెయ్యడం. డ్రామా చూడటంకోసం తాటాకు పందిరి కింద సెటిలై పోవడం. నాటకం మొదలవ్వగానే చూడండి వుంటుంది... తీర్ధంలో అమ్మకానికి తెచ్చిన బూరలన్నీ ఒకేసారి మోగినట్టుగా కుర్రగాలం 'బుయ్...' మని ఊదేవారు. ఒకటే ఈలలు.ఇందులో శ్రీహరి-సుబ్బిశెట్టి మధ్య వచ్చే సంభాషణలకి జనం ఒకటే ఈలలు, చప్పట్లు. వాటి ముందు నేటి వందరోజుల సినిమాలు ఎందుకు పనికిరావంటే అతిశయోక్తి కాదేమో.నాటకంలోని కళాకారులు సందర్భోచితంగా ఆ ఊరి ప్రెసిడెంట్,కర్ణం ఇలా  ఊళ్ళో కొంచెం పేరున్న వ్యక్తులను కూడా వారి నాటకంలో కలిపేసి డైలాగ్స్ అనర్ఘళంగా చెప్పేవారు.అలాంటి సమయంలో సదరు వ్యక్తులు అక్కడ వుండుంటే వెంటనే ఎంతోకొంత కళాకారులకు చదివింపుగా మైక్ లో ప్రకటించేవారు.

ఇక శ్రీహరి పాత్ర ను (చింతామణి తల్లి) మగవారే వేసేవారనే విషయం మొదట్లో నాకు తెలీదు. ఎందుకంటే ఆ మేకప్ లో అచ్చం ఆడవారికి మల్లే ఉండేవారు ఆ పాత్రను దరించే పురుషులు. కొంచెం ఊహ తెలిసిన తర్వాత తెలిసిన నిజం ఏమిటంటే..చింతామణి నాటకంలో శ్రీహరి వేషం వేస్తున్నది ఎవరో కాదు మా బడిలో ఐదవ తరగతి పిల్లలకు పాఠాలు చెప్పడానికి వచ్చిన 'గోపి' మాస్టారేనని. నేను అప్పుడు నాలుగో తరగతిలో వున్నాను.

నేను ఐదవ తరగతిలోకి వచ్చాను. మొదటిసారి 'గోపి' మాస్టారు సోషల్ చెప్పడానికి వచ్చారు. నాకు ఆయన్ని చూస్తుంటే శ్రీహరి, ఆమె కట్టిన గుమ్మడి పూల నీలంరంగు చీర, పొడవాటి జడ, జడ నిండా బుట్టెడు పూలు, ఒంటినిండా నగలు, నడుముకి వడ్డాణం, నాటకంలో వుండే పాత్రధారులతో ఆమె వేసే చతుర్లు..ఇవే గుర్తుకొస్తున్నాయి. క్లాసులో ఏం చెప్తున్నారో తెలీదు. నేనెక్కడో శివరాత్రి జాతరలోకి వెళ్ళిపోయాను. అప్పటికే ఆయన నన్ను గమనిస్తున్నారనే విషయం నాకు తెలియలేదు. నేను ఊహల్లో వుండగానే వాటంగా వున్న పచ్చి 'తూటుకర్ర'తో ఒక్కటిచ్చారు. దెబ్బ తగిలిందని నాకు  తెలియడానికంటే ముందే నాకళ్ళలో నీళ్ళు తిరిగిపోయాయి. "ఏరా..ఏం రోగం? ఇక్కడ పాఠం చెప్తుంటే అక్కడెక్కడో చూత్తున్నావేంటి. నువ్వు రామ్మూర్తిగారి మనవడవు కదూ. రేపొచ్చేటప్పుడు మీ తాతను తీసుకురా మాట్లాడాలి" అని క్లాసులో నుండి బయటకి వెళ్ళిపోయారు. ఆయన వెళ్తున్నప్పుడు కూడా ఆయన నడకలో నాకు అదే ఆడతనం కనిపించి ఏడుపు పోయి నవ్వొచ్చేసింది.

5 comments:

 1. చివరివరకూ చదివాక నా ప్రమేయం లేకుండానే నవ్వొచ్చేసింది బాలూగారూ..

  ReplyDelete
 2. హహహ పాపం బాలు గారు అలా దెబ్బలు తిన్నారనమాట! బాగుంది మీది ఆచంట దగ్గరనమాట! ఆ ఊరి జాతర నిజంగా చాలా బాగుంటుంది. ఇహ చింతామణి నాటకం అనగానే నాకు గుర్తొచ్చేది మాత్రం సురభి వాళ్ళే. ఎంత బాగా వేస్తారో!!! వాటి ముందు నేటి వందరోజుల సినిమాలు ఎందుకు పనికిరావంటే అతిశయోక్తి కాదేమో. నిజమేనండి నేను ఏకీభవిస్తున్నాను మీ అభిప్రాయంతో!

  ReplyDelete
 3. బాలూగారు,
  చెప్పేరు కాదు, మీది పాలకొలను దగ్గరటండి!

  ReplyDelete
 4. @ జ్యోతిర్మయి గారూ! మీ నవ్వుకి కారణంగా గోపీ మాస్టారు నన్ను కొట్టడం కాదుకదా.
  @ రసజ్ఞగారూ! నాకు అప్పట్లో నాటకం వేసేది ఎవరు అనేది పెద్దగా తెలిసేదికాదండి.కానీ సుబ్బిశెట్టి పాత్రధారి చేతికి ఉంగరాలకు బదులు చెగోడీలు పెట్టుకొచ్చి మధ్యమధ్యలో వాటిని తింటూ డైలాగ్ లు చెప్పడం భలేవుండేదండి. మీకు కూడా ఆచంట శివరాత్రి గురించి తెలుసంటున్నారు కాబట్టి నేను చెప్పేదేముంటుందండి.
  @ కష్టేఫలి గారూ! మొదటిసారి నాబ్లాగు కి వచ్చినందుకు స్వాగతం. పాలకొల్లు ను పాలకొలను గా సంభోదించి ఒక్కసారిగా పెద్దగోపురాన్ని గుర్తుచేసారు. కృతజ్ఞతలు.

  ReplyDelete