Thursday 4 July 2013

తెల్లబోయిన తెల్లగులాబి...

సూరీడు ముద్దబంతిలా ఉదయించాడు

సంద్రంలో తన మొహాన్ని తనే చూసుకుంటూ!

తెలవారిందని ఎవరు చెప్పారో ఆ తెల్లగులాబీకి


ఒళ్ళు విరిచి విచ్చుకుంది


తన ముల్లు తనకు గుచ్చుకోకుండా జాగ్రత్తపడుతు!


వచ్చి పోయేవారిని పలకరించాలని 


నవ్వుల రంగేసుకుని వయ్యారంగా ఊగుతూ


వాలుజడ సుందరి ఓర చూపులో పడింది!


కట్ చేస్తే...


నల్లని కురుల మధ్య తెల్లబోతూ కనిపించింది.


ముల్లు నుంచి తప్పించుకున్నంత సులువు కాదు


ఆడవారి కళ్ళ నుంచి తప్పించుకోవడం – అని 


మదనపడుతూ కూర్చుంది...మగువ సిగలో!

Tuesday 2 July 2013

ఆమె ఎవరు?

ఆకాశం పందిరి కింద ఆణిముత్యాలు ఏరుకుంటున్నట్టు
మట్టి మంచం పై చెమట చుక్కల కస్తూరి గంధం చిలుకుతున్నట్టు
అవని చెక్కిళ్ళపై మునివేళ్ళతో ముద్దాడుతున్నట్టు
ఆకుపచ్చని రంగుతో పసిడిపంటలకు పురుడు పోస్తున్నట్టు
అన్నపూర్ణమ్మ వాకిట్లో  మెతుకు బిడ్డలను సాకుతున్నట్టు
బిగికట్టిన అర కోకతో...
జడ కుచ్చిళ్ళు మెడవంపున జార్చి
అరుణకిరణాల గొడుగులో
కాయకష్టాల్ని ఆనందంతో ప్రేమిస్తున్న ఆమె ఎవరో కాదు!?
వరినాట్లు వేస్తున్న ఆడపడుచు..
ఆకలి తీర్చే అక్షయపాత్రకు ప్రాణం పోస్తున్న పల్లెపడుచు..!