Tuesday 28 May 2013

వేసవి పగబట్టింది!

ఆకాశంలో సూర్యుడు ఉగ్రరూపందాల్చినట్టు,
అగ్నిదేవుడు ఆగ్రహంతో రగిలిపోతున్నట్టు,
నిప్పుల కొలిమిలో అభ్యంగస్నానం చేస్తున్నట్టు,
నీడలు సైతం కొవ్వొత్తిలా కరిగిపోతున్నట్టు,
ఒకటే వేడి...!
నీరెండ కూడా నోరుతెరిచి చూస్తుంది
పట్టు చిక్కితే వడదెబ్బ కొట్టి మట్టుపెట్టాలని,
కిరణాల కోరలతో మరణాల పలహారాన్ని ఆరగించేయాలని.
ఈ వేసవి ఎందుకంతగా పగబట్టింది?
ఆకలిమంటతోనా?
కాదు...కాదు కడుపు మంటతో!
ప్రకృతి గర్భంలో పురుడుపోసుకున్న మానవుడు
కాలుష్య జ్వాలలతో కన్నతల్లి కడుపును కాల్చేస్తుంటే
ఆ కన్నపేగు మాత్రం ఎంతవరకు భరిస్తుంది?
అందుకే వేదనను వేడిగాలుల రూపంలో ప్రపంచం పైకి వదిలి
సాంత్వన పొందే ప్రయత్నం చేస్తుంది.

Saturday 25 May 2013

మనం తీసుకుంటున్న గోతిలో మనం




     ఎండలు మండిపోతున్నాయి, వడదెబ్బలకు జనం పిట్టల్లా రాలిపోతున్నారని గుండెలు బాదుకుంటున్నాం కాని ఇది పూర్తిగా మన స్వయంకృతం. మనం తీసుకుంటున్న గోతిలో మనమే పడుతున్నాం.  ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో  పచ్చని ప్రకృతిని ఎవరి పరిదిలో వారు చెరబడుతుంటే పాపం అది మాత్రం ఏంచేస్తుంది. పుడమితల్లిని కాపాడుకోవడంలో జనం చూపిస్తున్న అలవిమాలిన నిర్లక్ష్యం మున్ముందు మరింత ఉదృతమై మానవాళిని వివిధ రూపాల్లో ముంచెత్తబోతుందని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు.
     ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడని  ఎంతమొత్తుకున్నా బజారుకు వెళ్ళినప్పుడు కవర్ కొనడానికి మొగ్గుచూపుతాము తప్ప ప్రత్యామ్నాయాన్ని ఎంతమాత్రం ప్రోత్సాహించం. కురుస్తున్న వర్షం వృధాకాకుండా ఒడిసిపట్టండి అని పర్యావరణవేత్తలు తలబాదుకున్నా మన తలకెక్కదు సరికదా... మన ఇంట్లో ఇంకుడుగుంట తవ్వేంత ఉడత సాయం కూడా మనం చెయ్యలేము. కొత్తగా ఇల్లు కడుతుంటే జానెడు నేలను మిగిల్చి రెండు చెట్లు నాటి పచ్చదనానికి మనవంతు ప్రాణంపోయాలనే బుద్ది మనలో ఎంతమందికి ఉంటుంది. ఇంధనాన్ని ఆదాచేసి భూతాపాన్ని తగ్గించాలనే కనీస బాధ్యత కూడా మనకు గుర్తుకురాదు. ఒక పేపర్ ని వేస్ట్ చెయ్యడం లాంటి చిన్న చిన్న పనులద్వారా కూడా మనం ప్రకృతిని తీరని అనర్ధం చేస్తున్నాం.  చెప్పుకుంటూపోతే ఇలాంటివి కోకొల్లలు. పక్కింటివాడి ఇల్లు తగలడుతుంటే మనకెందుకులే అని ఊరుకుంటే తర్వాత తగలబడేది మన ఇల్లే. ఎండ తీవ్రతకు తాళలేక ఎవరో చనిపోయారని నేడు లెక్కలేసుకుంటున్నమనమే..రేపటి చావుచిట్టాలో ఉండమని గ్యారంటీలేదు. నిజంగా ఇది ప్రకృతి మనకు చేస్తున్న ఒక ముందస్తు హెచ్చరిక. ఇప్పటికైనా కళ్ళుతెరవకపోతే మున్ముందు మిగిలేది బూడిదే.