ఆకాశంలో సూర్యుడు ఉగ్రరూపందాల్చినట్టు,
అగ్నిదేవుడు ఆగ్రహంతో రగిలిపోతున్నట్టు,
నిప్పుల కొలిమిలో అభ్యంగస్నానం చేస్తున్నట్టు,
నీడలు సైతం కొవ్వొత్తిలా కరిగిపోతున్నట్టు,
ఒకటే వేడి...!
నీరెండ కూడా నోరుతెరిచి చూస్తుంది
పట్టు చిక్కితే వడదెబ్బ కొట్టి మట్టుపెట్టాలని,
కిరణాల కోరలతో మరణాల పలహారాన్ని ఆరగించేయాలని.
ఈ వేసవి ఎందుకంతగా పగబట్టింది?
ఆకలిమంటతోనా?
కాదు...కాదు కడుపు మంటతో!
ప్రకృతి గర్భంలో పురుడుపోసుకున్న మానవుడు
కాలుష్య జ్వాలలతో కన్నతల్లి కడుపును
కాల్చేస్తుంటే
ఆ కన్నపేగు మాత్రం ఎంతవరకు భరిస్తుంది?
అందుకే వేదనను వేడిగాలుల రూపంలో ప్రపంచం పైకి
వదిలి
సాంత్వన పొందే ప్రయత్నం చేస్తుంది.
No comments:
Post a Comment