Saturday 22 June 2013

మేమాడిన గేదెల పందెం ఆట

     ఓ రకంగా  చెప్పాలంటే పల్లెల్లో బాల్యం చిన్ననాటి స్వర్గం. అందులోని మాధుర్యం అనుభవిస్తేనే గాని తెలీదు. ఆటలకు విశాలమైన పచ్చిక మైదానాలు. వాటికి తోడు చెట్లు, చేమలు, చెఱువులు, కాలువలు.. వీటితో అనేక కొత్త కొత్త ఆటలు. ఆ సమయంలో ఒంటికి దెబ్బలు కూడా అలాగే తగిలేవి. అంతమాత్రాన ఆటలు ఆపెయ్యాలంటే మనసు ఒప్పుకుంటుందా? అది పలుపు తెగిన లేగదూడలాంటి. దెబ్బతగిలితే ప్రకృతి వైద్యం చేసుకుని మళ్ళి ఆటల్లో పడటమే. 

     మా పిల్లగాలం అందరూ కలసి ఒకరోజు గేదెల పందెం అనే కొత్త ఆట కనిపెట్టారు. ఇందుకు కావల్సింది రెండు గేదెలు, ఇద్దరు కుర్ర మొనగాళ్ళు.  కాబోలోరు తూము కాడ నుంచి అవుచ్చెఱువుకి మధ్య దూరం రెండు కిలో మీటర్లు ఉంటుంది. మందలోంచి రెండు గేదెల్ని ఎంచుకోవాలి. కాబోలోరు తూము దగ్గర ఇద్దరు కురాళ్ళు గేదెల పై ఎక్కి ఎలాంటి ఆధారాన్ని పట్టుకోకుండా కూకోవాలి (...అంటే కూర్చోవాలి). ఎనక నుంచి మరో ఇద్దరు కుర్రాల్లు వాటిని కొడుతూ వుంటే అవి గబగబ నుడుస్తూనో, పరిగెడుతూనో కాబోలోరు దారంటా అవుచ్చెఱువు వైపు లగెడతాయి. గేదెలపై కూకున్న వాళ్ళలో ఎవరైతే పడకుండా చివరి వరకు వుంటారో వాళ్ళు గెలిచినట్టు లెక్క. ఎవరైనా మద్దెలో పడిపోతే పడ్డచోట నుంచి కుంటుకుంటూ, కూత పెట్టుకుంటూ అవుచ్చెరువు వరకు వెళ్ళాలి.  


     కాబోలోరు తూము కాడనుంచి పందెం మొదలయ్యింది. యార్లగడ్డ  ముత్యాలు కొడుకు దాసు, మారంపూడి వాన కొడుకు సామి  ఇద్దరూ గేదెల్ని ఎక్కారు. ఎనక నుంచి మరో ఇద్దరు వాటిని తూటు కర్రల్తో, తోలుగర్రల్తో కొడుతున్నారు. అవి గెలాపెడుతున్నాయి. పైనున్న ఇద్దరు కింద పడకుండా గేదెల పొట్టల్ని కాళ్ళతో తన్ని పట్టుకుని కూర్చుని పట్టు నిలుపుకుంటున్నారు. చుట్టూ మిగిలిన పిల్లగాలం అరుపులు, కేకలు,గోలలు.. ఆళ్ల గోలకి ఆ గేదెలు రెండూ ఇంకా గెలాపెత్తుతున్నాయి.   గొల్ల సత్తుం గారి ఇల్లు మలుపు దాటాక అప్పలాచారి గారి నల్ల చెఱువు చూడగానే అందులో ఒక గేదె అమాంతంగా చెరువులోకి దూకేసింది. దాంతో దాని మీద కూకున్న మారంపూడి వాన కొడుకు సామి తల్లకిందులుగా కిందకి పడుతూ చెరువులోకి వంగి వున్న కొబ్బరి మట్టలో పడ్డాడు. వెంటనే మాలో కొంచెం పెద్దోడు, పొడుగ్గా వుండే కాశి గబగబ కొబ్బరి మట్ట ఎక్కి సామిని చెర్లోకి తోసేసి బయటకు లాక్కొచ్చాడు.  కొబ్బరి మొత్తలు, డొలకలకు సామి ఒల్లంతా చీరుకుపోయి పల్చగా రక్తం బయటకొత్తుంది. చుట్టు చేరిన పిల్లగాలమంతా ‘రక్తం..రక్తం..రేయ్ ఉత్తరేణి ఆకు తెండ్రా’ అని అరుస్తున్నారు. అది ఎక్కడుంది.... కింద వుంది చూడండి!



     దీని ఆకుల్ని కోసి అరచేతుల్లో వేసుకుని వుండలా చుట్టి నలిపితే పసర వస్తుంది. దాని దెబ్బల మీద వేస్తే కొంచెం మండుతుంది కాని... రెండు రోజులకు పుండు మాడిపోతుంది. పల్లె బతుకులకు ఇదో ప్రకృతి వైద్యం, అందుకే ఒక మాదిరి దెబ్బలకు మేం భయపడం,,డాక్టరనో,,బిళ్ళలనో పరిగెత్తం.

గేదెల పందెం లో అప్పలాచారి నల్ల చెఱువు కాడ తల్లకిందులుగా కిందపడి ఒళ్ళంతా దెబ్బలు తిన్నాడు సామి. ఈ విషయం ఇంట్లో తెలిసి జరిగిన పెళ్ళి గురించి మళ్ళీ టపాలో చెప్తాను.

2 comments:

  1. బావుందండీ .ప్రమాదం తో కూడిన సాహసం కదా! . కాబట్టే గుర్తుండిపోయిందంటారా?ఇంతకూ మీ తెలుగు లోని యాస ఏ ప్రాంతానికి చెందినదండీ?

    ReplyDelete
  2. నాగరాణిగారూ! ఊసులతీరం కు స్వాగతం. నిజంగా ప్రమాదమే కాని అప్పుడు ఏమీ తెలిసేది కాదు. ఇది గోదావరి జిల్లాల యాసతో కూడినదండి.

    ReplyDelete