Friday 27 January 2012

'నో పానీ..నో పూరీ'.

అనగనగా ఒక కాకి. దానికి ఒక పానీపూరి దొరికింది. పూరీ దొరికితే కర్రీతో తినెయ్యొచ్చు. కానీ ఇక్కడ దొరికింది పానీపూరీ. తప్పనిసరిగా 'పానీ' ఉండి తీరాల్సిందే. ఈ జనారణ్యంలో మంచినీళ్ళను పట్టుకోవడం కంటే మందునీళ్ళను తెచ్చుకోవడం చాల సులభం. ఎలాగైనా సరే 'పానీ' సంపాదించి 'పూరీ' తినాలని దాన్ని ముక్కున కరుచుకుని హైటెక్ సిటీ నుండి ఆర్.ఎఫ్.సి వరకు తిరుగుతూనే ఉంది.విచ్చలవిడిగా వైన్ షాపులు, అక్కడక్కడ కూల్ డ్రింక్ లు తప్ప నీళ్ళు మాత్రం దొరకలేదు. ఏం చెయ్యాలా అని హైవే మీదికి వచ్చి దిక్కులు చూస్తుంటే రోడ్డు పై దూరంగా నీళ్ళు కనిపించాయి. ఆశతో అక్కడికి ఎగురుకుంటూ వెళ్ళింది. విచిత్రంగా అక్కడ నీళ్ళు మాయమైపోయి మరికొంత దూరంలో కనిపించాయి. మళ్ళీ అక్కడకు ఎగురుతూ వెళ్ళింది. మళ్ళీ అదే సీన్..'ఏంటబ్బా ఈ యిచిత్రం?' అనుకుంది కాకి.అప్పుడు గుర్తొచ్చింది చిన్నప్పుడు వాళ్ళమ్మతో పాటు టీవి చూస్తుండగా సీరియల్ లో చూసిన ఒక పాట 'ఎండమావులే...'. ఒహో ఎండమావులంటే ఇవేనేమో అనుకుంది.
సరే ఇంతకూ  పానీ లేకుండా ఈ పూరీ ఎలా తినాలి?.
ఏం చెయ్యాలో తోచక ఒక చెట్టు కొమ్మమీద కూర్చుని ఆలోచించసాగింది. ఇంతలో ఆ చెట్టు కింద ఒక జిత్తులమారి చేరింది.. అది కాకి ముక్కుకున్న పూరి కొట్టేయాలని ప్లాన్ వేసింది.
'కాకమ్మా...కాకమ్మా'
ఎంటన్నటు తలూపింది కాకి
'నువ్వు చాలా చక్కగా పాడతావంట.. అందరూ అనుకుంటున్నారు. నేను నిన్ను కలిసి నీపాట స్వయంగా వినాలని వెతుకుతూ బయల్దేరితే నువ్వే నాకు కనిపించావు. ఏదీ నాకోసం ఒక్కసారి ఒక పాట పాడవా? అని అడిగింది నక్క.
వెంటనే కాకి ప్లాష్ బ్యాక్ లో వాళ్ళ తాత చెప్పిన స్టోరీని గుర్తుచేసుకుంది. "వెనకటికి ఒక నక్క వాళ్ళ తాతను ఇలాగే ఉబ్బేసి దాని నోట్లో ఉండే జున్ను ముక్కను ఎత్తుకుపోయింది".
ఆవిషయం గుర్తొచ్చిన కాకి "ఒరేయ్ జిక్క (జిత్తులమారి నక్క). నీ మాటలకు మోసపోవడానికి నేనేమి ముత్తాత కాకి ని కాదురా.." అనుకుని దాని నోట్లో వున్న 'పానీపూరీ' కాలితో జాగ్రత్తగా తొక్కి పట్టి పాట అందుకుంది.
"ఆకలేస్తే అన్నం పెడతా.. అలిసొస్తే ఆయిల్ పెడతా" అని పాట మొత్తం 'కా' భాషలో కుమ్మేసింది.
కాకి చాలా తెలివైనదని గుర్తించింది నక్క. కానీ వదలకూడదు ఎలాగైనా 'పానీపూరి' కొట్టేయాలి అనుకుని..
పాట పూర్తవ్వగానే "సూపర్ కాకమ్మా! చాలా బాగుంది. కానీ నువ్వు అచ్చం మీ తాతలాగ ఒద్దికగా పాడావ్. అక్కడే పాట మూడ్ పోయింది" అంది నక్క.
"అంటే" అర్దం కాక అడిగింది కాకి.
"ఈ పాట దేవీశ్రీ ప్రసాద్ స్టేజ్ మీద పాడితే ఇలా పాడతాడా చెప్పు. స్టేజ్ మొత్తం చిందులేసి చించెయ్యడు. బహుశ నీకు డాన్స్ రాదనుకుంటా అందుకే పాటతో ఆపేసావ్"
అనగానే కాకి..
"నో..నో..నో..నాకు డాన్స్ రాదని అనకు. ఆట ప్రోగ్రాంలో ఓంకార్ అన్నయ్య నా డాన్స్ చూసి 'కాకా..అందరూ డాన్స్  చేస్తారు నువ్వు మాత్రం కుమ్మేస్తావ్' అన్నాడు. సుందరం మాస్టారైతే 'నువ్వు డాన్స్ చేస్తుంటే జ్యోతిలక్ష్మి అనే ఒకావిడ ఉందన్న విషయమే మర్చిపోతున్నాం' అన్నాడు అని గొప్పలు చెప్పింది కాకి.
"అలాగే ఏది ఒక స్టెప్ వేసి చూపించు" అని అడిగింది నక్క.
కాకి ఒకసారి తను ఆట షో లో వేసిన డాన్స్ గుర్తుచేసుకుని స్టెప్ వెయ్యడానికి కాలు పైకి లేపింది. వెంటనే దాని కాలి కింద వున్న 'పానీపూరి' కిందకు జారిపోయింది.ఆలస్యం చెయ్యకుండా నక్క దాన్ని అందుకుంది.అది చూసిన కాకి అవాక్కై అంతలోనే తేరుకుని "ఓరి నక్కబావా. నువ్వు నా దగ్గర్నించి కొట్టేసింది 'పానీపూరి'. అది తినాలంటే 'పానీ' కంపల్సరి. ఈ సిటీ మొత్తం తిరిగినా దాన్ని తినడానికి 'వాటర్' లేదు" అని అంది.
"వాటర్ లేకపోతేనేం కాకమ్మా నాదగ్గర క్వాటర్ వుందిగా" అని జేబులోంచి మందు బాటిల్ తీసి చూపించి, నడ్డి ఊపుతూ కాకిని ఎక్కిరిస్తూ వెళ్ళిపోయింది నక్క.
పాపం కాకి!  'నో పానీ..నో పూరీ'.

14 comments:

  1. వాటర్ బాటిళ్ళు లేకపోయినా క్వార్టర్ బాటిళ్ళు బాగనే దొరుకుతున్నాయ్!!!

    ReplyDelete
    Replies
    1. @ కస్టేఫలి గారు! కొటేషన్ బాగుందండి.

      Delete
  2. ఓహ్, మీరూ, అవ్వా, కాకీ, వడ, కథలు చెబ్తా రన్న మాట !!

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
    Replies
    1. @ చీర్స్ జిలేబీగారు! ఇలాంటి కథలతో మున్ముందు 'మందు వింది'...క్షమించండి...'కనువిందు'...అబ్బా ఇది కూడా కాదు పసందు చేస్తాను.

      Delete
  3. "ఒరేయ్ జిక్క (జిత్తులమారి నక్క).నీ మాటలకు మోసపోవడానికి
    నేనేమి ముత్తాత కాకి ని కాదురా.."" :) :)

    బాలు గారు ఈ తరం కాకి కధ బాగుందండీ!

    ReplyDelete
    Replies
    1. @ రాజీగారు! జిక్క మీకు నచ్చినందుకు కృతజ్ఞతలండి.

      Delete
  4. హహహ! బాగుందండీ! పాపం పిచ్చి కాకి పానీ పూరీకి పానీ లేకపోతే దహీతో దహీ పూరీ తినచ్చుగా!
    మీరు ఇది గుర్తుచేసారా నాకు పానీ పూరీ కావాలి! హు హు హు! ఇప్పుడెలా? మాకు పానీ ఉంది కానీ పూరీ మీరు పంపండి ;)

    ReplyDelete
  5. @ అవును కదా! దహీపూరీ ఐడియా నాకు వచ్చినా పాపం కాకికి పూరీ దక్కేది. రసజ్ఞగారూ! పూరీ కావాలంటే కామెంట్ పెట్టడం ఎందుకండి, కాకితో కబురంపితే దానితోనె పంపించేవాడినండి.

    ReplyDelete
    Replies
    1. ఈ తరం కాకమ్మ అంత తెలివైనదన్నమాట :) బాగుంది .

      Delete
    2. రియాలిటీ షో ల ప్రభావం మాలాకుమార్ గారు. ఏం చేస్తాం చెప్పండి.

      Delete
  6. హహ్హ.. బాగుంది మీ కాకి కధ

    ReplyDelete
    Replies
    1. రాజచంద్ర గారూ! మీకు నచ్చినందుకు సంతోషం.

      Delete
  7. సిధ్ధిగారూ! మీకు అంతగా నచ్చినందుకు నాకు పిచ్చ సంతోషంగా ఉంది.

    ReplyDelete