Friday, 13 January 2012

భోగివేళ జోగమ్మ గోల

అది జనవరి నెల పన్నెండో తారీకు. ఊరు ఊరంతా నిద్దట్లో ఉండగా ఆ మిసపుటేల అమాంతంగా ఒకటే కేకలు. యార్లగడ్డ సుబ్బారాయుడు ఇంటి పక్కనున్న 'జోగమ్మ' కు మళ్ళీ ఏదో ఉపద్రం ముంచుకొచ్చిందని ఆ కేకలింటే ఇట్టే చెప్పొచ్చు."ఒరే! ఎవర్రా మీరు. నా***లారా. సందకాడ్నించి కంటి మీద కునుకెయ్యకుండా కంట్లో ఒత్తులెట్టుకుని మరీ కాపలాగా వున్నాను. దొంగసచ్చినోళ్ళారా. ఊల్లో ఇంతమంది ఇల్లుండగా మీకు నా ఇల్లే దొరికిందేంట్రా...." జోగమ్మ తిట్ల పురాణం కొనసాతూనే ఉంది.

సంక్రాంతి పండగొచ్చిందంటే భోగి నాడు పాత ఇల్లు వున్నవారు, పాత కలప వున్నవారు వాటిదగ్గర కాపలాగా పడుకోవాల్సిందే. లేదంటే ఆ కలప తెల్లారాక ఏ వీదిలో వేసిన మంటల్లో బొగ్గులై కనిపిస్తుందో  ఎవరికీ తెలీదు.సంక్రాంతి నెల పట్టారంటే చిన్న పిల్లల మార్కెట్ లో 'ఆవు పేడ' కు ఆమాంతంగా డిమాండ్ పెరిగిపోతుంది. భోగి పిడకల్ని ఆవు పేడతోనే చెయ్యాలి. లేదంటే కళ్ళు పోతాయని అనేవారు. ఆవులు, గేదెలు కలిసి వున్న గొడ్ల సావిడి నుండి పేడ తెచ్చి భోగి పిడకలు చెయ్యాలంటే భయం. ఎందుకంటే అందులో గేదె పేడ కలిసిపోయిందేమోనని అనుమానం. అందుకే ఎక్కడన్నా ఒక్క ఆవు పడుకుని ఉందంటే కుర్రగాలం దాని చుట్టూ చేరి అది ఎప్పుడు లేస్తాదా? పేడ ఎప్పుడు వేస్తాదా (అవి లేవగానే చేసె పని అదే) అని ఎదురు చూసేవారు.ఆవుపేడతో గారె సైజు , అరిసె సైజు, అరటి పండు ఆకారం.. ఇలా రకరకాలుగా భోగి పిడకలు తయారు చేసి దండలా గుచ్చి భోగి కోసం ఎదురు చూడటం అలవాటు.

మా ఇంట్లో పిల్లలకు సంక్రాంతి ఎంత ఇష్టమైన పండగో అంత కష్టమైన పండగ. ఎందుకంటే భోగి రోజు తెల్లవారు ఝామునే 4 గంటలకు నిద్రలేపేసేవారు. చలి గిలి అనకుండా పిల్లలందరు గోచీలు పెట్టుకుని స్నానాలకు సిద్దమైపోవాలి. ఆ చలిలో నూతికాడ కూచ్చోబెట్టి నలుగు పెడుతుంటే ఒక పక్క నిద్రమత్తు, మరో పక్క నలుగు మంట, ఇంకో పక్క దోమపోట్లు.. పెద్దవాళ్ళను ఏమీ అనలేక, ఆ బాదలు తట్టుకోలేక ఒక్కొక్కరం ఏడుపురాగాలు మొదలుపెట్టేవాళ్ళం.
"భోగి రోజు వెలుగురాకుండా స్నానం చెయ్యకపోతే ముసలి పెళ్ళాం వస్తుందిర" అని అమ్మమ్మ అంటుంటే అప్పటికి దాని గురించి పూర్తిగా తెలియకపోయినా అదో భయం. నలుగు ఐపోయాక అసలు గండం మరోటి వుంది. అదే తలస్నానం. మెడలు మోకాళ్ళ మీదకు ఆన్చి కుంకుడు పులుసుతో తల రుద్దుతుంటే 'కళ్ళుతెరవకూడదు అనుకుంటూనే తెరిచెయ్యడంతో, కుంకుడు పులుసు కళ్ళలోకి వెళ్ళి ఒకటే మంట. ఆసమయంలో ఎంత కాదనుకున్నా ఏడుపు ఎక్కువయ్యేది. ఆ ఏడుపునంతటినీ పోగొడుతూ ఇంతలో తాతయ్య రోడ్డు మధ్య పేద్ద భోగిమంట సిద్దం చేసి ఒక్కొక్కర్ని పిలిచేవారు. కొత్త బట్టలకు పసుపు రాసుకుని సగంసగం వేసుకుని పిల్లలందరం ఆ మంట చుట్టూ చేరి ఆ మంట వెలుగులో వాటికి బొత్తాములు పెట్టుకుంటూ చలి కాగేవాళ్లం.

అప్పటివరకు దండల్లా వున్న భోగి పిడకలు ఒక్కొక్కటి మంటల్లో కాలి కచ్చికల్లా మిగిలితే ఆ పొడిని తీసుకుని బొట్టులా పెట్టుకుంటుండగా అర్దరాత్రి కేకలు పెట్టిన జోగమ్మ కర్ర ఊతం చేసుకుంటూ ఏడుస్తూ వచ్చేది...ముందుగా నెంబరు కొండయ్య (మాజీ వార్డు మెంబర్) ఇంటికెళ్ళి'అయ్యా కొండయ్యగారా! చూసారా. ఒంటరి ఆడదాన్ని చేసి రాత్రంతా కుర్రగాళ్ళు నా ఇంటి పంచకున్న గెడలన్నీ లాక్కెళ్ళిపోయారయ్యా. మీరియ్యాల సంగం పెట్టించి న్యాయం చెయ్యాలి' అని మొరపెట్టుకుంది. 'నేను మాటాడతాలే' అని నెంబరు కొండయ్య పంపించేత్తే అక్కడ్నించి మా ఇంటి కి వచ్చింది...!

"..అయ్యా రామ్మూర్తిగారా! ఆ పిట్టా ఏసు, ఈ జంగాలోడు, కొంగ సత్తుం, ఏకోబు, దర్మయ్య గారి బండోడు, సూరేకాంతం మేనల్లుడు,బాలాసామి, పెద్దేసు, ..ఈళ్ళందరూ కలిసి భోగి మంటలో వెయ్యడానికి సూర్లో దాచిన గెడలన్నీ ఎత్తుకెళ్ళిపోయారండి. ఈ వయసులో ఈ ముసల్దాన్ని ఏడిపించడం ఏమన్న ఇదాయకమా చెప్పండి? ఆళ్ళ జిమ్మడ, ఆళ్ళ చేతులు పచ్చవాతమొచ్చి పడిపోను.." అంటూ ఏడుపు లంకించుకుంది. ఆవిడ అలా ఏడుస్తుంటే మేమందరం 'అయ్యో పాపం' అనుకుంటూ ఆమె వైపు జాలిగా చూస్తుంటే... "జోగమ్మా! పిల్లలేదో పండగని ముచ్చట పడి అల్లరి చేసుంటార్లే. నువ్వు చెప్పినోళ్ళందరు 'పాపం జోగమ్మ' అని ఇంట్లో వొండుకున్న పిండి వంటలన్నీ మళ్ళీ నీకు పట్టుకొచ్చి పెడతారు కదా. పండగపూట నువ్వలా ఏడటం, వాళ్ళనలా తిట్టడం మంచిదికాదుగాని.. ఇదుగో ఈ వంద పట్టుకెళ్ళి పండగ చేస్కో..వెళ్ళు' అని తాతయ్య ఆమెకు చొక్కా జేబులోంచి వంద రూపాయల నోటు తీసి ఇస్తుంటే ఆమె ముఖంలో సంక్రాంతి పండగ ఆనందమంతా ఒక్కసారిగా కనిపించేది.
***బ్లాగరులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు***

7 comments:

 1. యిప్పటికీ యిలా పట్టుకుపోయి మంటలో పడేస్తూనే వున్నారు, పల్లెలలో. సంక్రాంతి శుభకామనలు

  ReplyDelete
 2. చాలా బాగా చెప్పారు బాలు గారూ! మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు!

  ReplyDelete
 3. బాలూ గారూ మీక్కూడా సంక్రాంతి సుభాకంక్షలండీ..

  ReplyDelete
 4. kastephale గారు, రసజ్ఞగారు, జ్యోతిర్మయిగారు.. మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు.

  ReplyDelete
 5. బాలు గారూ..
  మీకు సంక్రాంతి శుభాకాంక్షలు.

  ReplyDelete
  Replies
  1. బాగుంది :)
   సంక్రాంతి శుభాకాంక్షలు .

   Delete
 6. @ రాజీగారు! సంక్రాంతి శుభాకాంక్షలండి.
  @ మాలాకుమార్ గారు! మీక్కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే నా ఊసులతీరం కు స్వాగతం.

  ReplyDelete