Sunday 22 January 2012

ఆదివారం శుభాకాంక్షలు

తెల్లారగట్ల మాంచి నిద్దట్లో ఉండగా ఎవరో నన్ను పిలుస్తున్నట్టుగా అనిపించి కల్లోనే కళ్ళు తెరిచి చూసాను. చుట్టూ బోలెడంత వెలుగుతో తల స్థానంలో ఎల్.సి.డి మానిటర్ తో చేతిలో కీబోర్డ్, మౌస్, పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్ లాంటి పరికరాలతో ఓ విచిత్రమైన వ్యక్తి కనిపించాడు.
ఆకారం, రూపం చాలా కొత్తగా ఉంది.ఇంతకుముందెప్పుడు ప్రత్యక్షంగా అలాంటి వ్యక్తిని చూసిన దాఖలాలు లేవు.ఆలోచించడం అనవసరం అనిపించి...
"ఎవరండీ మీరు?" అని ఆయన్నే అడిగేసాను.
"నన్ను గుర్తుపట్టలేదా?"
"లేదండి..ఎవరండి మీరు?"

"నేను..బ్లాగురాజు ని"
"బ్లాగురాజా? నేనింతకు ముందెప్పుడు మిమ్మల్ని చూడలేదండి. కొంచం వివరంగా చెప్పండి బుర్ర హీటెక్కిపోతుంది"
"అదేంటి బాలు. ఊసులతీరం అనే ఒక బ్లాగు ని నాలో ఓపెన్ చేసావ్ నన్ను గుర్తించకపోవడమేంటి"

"ఓ మీరా! అయ్యబాబోయ్ సారీయండి. గుర్తుపట్లేపోయాను"
"పర్వాలేదు"
"అది సరేగాని బ్లాగురాజు గారు మీరేంటి ఇలా ఒచ్చేసారు?" అవసరం ఆయనదేమోననుకుని అడిగేసాను.
"ఏముంది నాయనా. ఊసులతీరం అనే బ్లాగ్ ఓపెన్ చేసావ్. మొదట్లో బాగానే టపాలు రాసావ్. ఈ మద్య మరీ టపాలు రాయడం తగ్గించేసావ్. ఇలాగైతే ఎలా చెప్పు"
"అది ఈ మద్య కొంచెం పని ఎక్కువై టైమ్ కుదరట్లేదండి"
"మాకు మాత్రం కుదురుతుందా చెప్పు. ఉన్నంతలో టైమ్ అడ్జస్ట్ చేసుకుంటూ నీలాంటి వాళ్ళందరికి బ్లాగ్ విషయం గుర్తుచెయ్యట్లేదా"
"కరెక్టేనండి.కానీ..."
"కానీ లేదు కరెన్సీ లేదు. నువ్విలా క్రమశిక్షణ, సమయపాలన లేకుండా బ్లాగునలా వదిలేస్తే..ఆ ఊసులతీరంలో ఊసులు లేక, సందర్శకుల తాకిడి లేక  బోసిపోవట్లేదు?"
"అవునండి"

"నీ బ్లాగులో మొదటి కామెంట్ పెట్టిన రసజ్ఞగారు, నిన్ను తమ కామెంట్లతో ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తున్న జ్యోతిర్మయి, రాజి, జిలేబి, మధురవాణి, సాదారణ పౌరుడు, సుభ, శిశిర, కస్టేఫలి, కొత్తపాళీ,raf raafsun, మీను, వెన్నెల... వీరందరూ నీ గురించి ఏమనుకుంటారు చెప్పు?"
"కరెక్టేనండే.."

"ఏమిటి కరెక్టు..ఇప్పటికైనా కళ్ళు తెరిచి విధిగా టపాలు రాయడం ప్రారంభించు"
"అలాగే బ్లాగురాజుగారు! రేపట్నించి క్రమం తప్పకుండా రాసేత్తానండి"
"రేపటిదాకా ఏమిటి వర్జ్యం. ఇప్పుడే ప్రారంభించు"
"అంటే.. ఇప్పటికిప్పుడు రాసెయ్యమంటే ఏం రాయాలో బుర్రకెక్కట్లేదు. పోని ఏం రాయాలో మీరే చెప్పండి"
"ఏదొకటి రాయ్"
"అదే ఏంటా అని అడుగుతున్నానండి"
"నీకు తోచింది రాసెయ్. ఆఖరికి ఏమీ తోచకపోతే 'ఆదివారం శుభాకాంక్షలు' అని టపా పెట్టు"

"ఆదివారం శుభాకాంక్షలా"
"ఏం.. ఆదివారం శుభాకాంక్షలు చెప్పుకోకూడదా? అదిరోజు కాదా? మీలాంటివాళ్ళు రెస్ట్ తీస్కోవడానికి ఆదివారం కావాలిగాని, శుభాకాంక్షలు చెప్పుకోవడానికి అది పనికిరాదటయ్యా?"
"అ..వస్తుందండి"
"మరింకే.. ఆదివారం శుభాకాంక్షలు అని ఓ టపా రాసిపారెయ్"
"అలాగే బ్లాగురాజా" అని నేను అనగానే బ్లాగురాజు మాయమైపోయాడు.
ఆయన కోరికమేరకు...
బ్లాగరులందరికీ...
"ఆదివారం శుభాకాంక్షలు"

5 comments:

  1. నిజమేనండీ మరీ టపాలు రాయకుండా మానేస్తే ఎలాగా??
    మీ బ్లాగురాజు గారు మిమ్మల్ని మేల్కొలిపి మంచి పని చేశారు.
    మీకు కూడా "ఆదివారం శుభాకాంక్షలు"

    ReplyDelete
  2. బాలూ గారూ హహ బ్లాగురాజు భలే సలహా ఇచ్చాడు మీకు. మీక్కూడా ఆదివారం శుభాకాంక్షలు.

    ReplyDelete
  3. బాగుంది! మీకు కూడా ఆదివారం శుభాకాంక్షలు! అసలు మీరు ఈ మధ్యన ఏమీ వ్రాయడం లేదని నెనే ఒకసారి వెళ్ళమన్నాను ;)

    ReplyDelete
  4. శుభాకాంక్షలు తెలిపినవారికి మళ్ళీ తిరిగి చెప్పాలి కదా! మీకూ ఆదివారం శుభోదయం, శుభాకాంక్షలు. రాయండి, స్వానుభవమున చాటు నా సందేశ మిదే.........

    ReplyDelete
  5. @ రాజీగారు, జ్యోతిర్మయిగారు కృతజ్ఞతలు మరియు సోమవారం శుభాకాంక్షలు.
    @ రసజ్ఞగారు బ్లాగురాజు ని వెళ్ళమని చెప్పి మంచిపని చేసారు.
    @ కస్టేఫలిగారు! మీకు కృతజ్ఞతలతోపాటు ఆదివారం మరియు సోమవారం శుభాకాంక్షలు.

    ReplyDelete