Sunday, 20 November 2011

చింతావారి కాఫీహొటల్ - సేనాపతుల కాఫొటల్

వంశీగారి కథలలోని పాత్రలన్నీ మన చుట్టూ వుండేవే కనిపిస్తాయి. గోదావరి జిల్లాలవారికైతే మరీను..ఆ కథలు చదువుతుంటే చిన్నప్పుడు నాకు తెలిసిన ఎన్నో పాత్రలు అమాంతంగా ప్రత్యక్షమై నన్ను గతంలోకి లాక్కెళ్ళిపోయి జ్ఞాపకాల ఆతిధ్యంతో మనసును మైమరపింపజేస్తాయి.పూతరేకులు తిన్నంత మాధుర్యం ఆ సమయంలో. అందుకే వంశీగారి పాత్రలు, వాటికి కొంచెం దగ్గర పోలికలు వుండి నాకు ఎదురుపడిన వ్యక్తులను గుర్తుచేసుకోవడంకోసం బ్లాగు రూపంలో ఈ చిరుప్రయత్నం.
ముందుగా 'మా పసలపూడి కథలు'లో "శ్రీశ్రీశ్రీ పూసపాటి రాజావారు" కథ నుండి నాకు తెలిసిన పాత్రలను, ప్రదేశాలను గుర్తుచేసుకుంటున్నాను.
చింతావారి కాఫీహొటల్ - సేనాపతుల కాఫొటల్ :  ఇది మా పెనాదం (పెనుమదం) సెంటర్లో చాలా ఫేమస్.తాటాకుతో కుట్టిన  పెద్ద సైజు పూరిగుడిసెలా వుండేది ఈ కాఫటల్ (కాఫీహొటల్).మేము బైటకెల్లి టిఫిన్ తినడమే చాలా తక్కువ కాని ఎప్పుడెల్లినా ఇది బిజీగానే వుండేది. చిన్న చిన్న బల్లలు, సత్తుగ్లాసులు, చిన్న అరిటాకులతో టిఫిన్ వడ్డించే స్టీలు ప్లేట్లు. అప్పట్లో అన్ని హొటల్లో ఊకపొయ్యలు వుండేవి. లోపలికెళ్తే వెచ్చగా వుండేది. చింతామణి చట్నీ, బొంబాయి చట్నీ తో దిబ్బరొట్టు తింటే వుంటాది నాసామిరంగా.. అది చెప్తే కుదరదు తినాల్సిందే. ప్రస్తుతం ఈ హొటల్ పోయి చిన్న సైజు షాపింగ్ కాంప్లెక్స్ వచ్చింది.అందులో ఒక పోర్షన్ లో బజ్జీపప్పు అమ్ముతున్నారు.

పదం సువార్త - పల్లమ్మగారి సువార్త : అసలు 'సువార్త' అనే పదానికి అర్ధం ఏమిటో నాకు ఇప్పటికీ కరెక్ట్ గా తెలీదు. బహుశ 'శుభవార్త' అనే పదానికి వాడుక రూపమే 'సువార్త' అయ్యుంటుందేమోనని నాకు అప్పట్నించి ఇప్పటివరకు వున్న ఒక అభిప్రాయం.  ఇలాంటి సువార్త అనే పేరున్న వాళ్ళు చాలామందే వున్నారు. 'పిల్లేయ్..సువార్త! నీళ్ళు తోడేటప్పుడు  అంత ధబేల్న పడేత్తే చేద తెగిపోయి నూతిలో పడిపోద్ది' అని మా అమ్మమ్మ ఈ పల్లమ్మగారి సువార్తను అంటుంటేది.
బొడ్డు సూరయ్య - బొడ్డు సూర్నారాయ్న : మేము హైస్కూల్ చదివేరోజుల్లో సూర్నారాయ్న గారి కొట్టంటే బాగా ఫేమస్. ఇక్కడ గుండుసూది కాడ్నించి అట్లాస్ వరకు ఏదైనా దొరుకుతుంది. పావలాకు పెట్టే దోసెడు బఠానీలు, దోసెడు బొంబాయ్ సెనగలకు సూర్నారాయన కొట్టంటే కుర్రగాలానికందరికీ నోటెడ్. దీపావళి వస్తుందంటే చాలు సిసింద్రీ గుల్లలు, సూరేకాంతం, మతాబు గుల్లలు తెగ కొనేత్తారు. ఉలవలు కట్టడానికి వుపయోగించే పేపర్లను కూడా పుస్తకాల అట్టల్లాగ అమ్మేసేవాడు ఈ బొడ్డు సూర్నారాయ్నగారు. 
ఉల్లిపాయల గంగిరెడ్డి - ఉల్లిపాయల నారాయణ : వారానికి ఒక్కరోజు  లచ్చివారం (లక్ష్మివారం, గురువారం)మా ఊరిసంత. ఉల్లిపాయల నారాయనమూర్తి కొట్టంటే పెనాదం మొత్తానికి తెలిసిన పేరు. ఎవరైనా కాయగూరలు కొనాలని వెళ్ళి 'కేజీ ఎలాగండి నారాయన మూర్తిగారు?' అని దేన్నైనా అడిగితే చాలు. 'సవకే అబ్బాయ ఏస్కో' అని తక్కెడను అందులోకి పోనిచ్చి కేజీ నికరంగా తూసి సంచులో వేసేసేవాడు.ఈయన యాపారం చేత్తుండగానే పెద్దకొడుకులిద్దరూ కూడా ఇదే యాపారం పెట్టి ఆయనే కాంపిటేసన్ ఐపోయారు.
... అర్టిపళ్ళు,కలర్ సోడా అమ్మే మేడపాడు రాజుగారు.. వెండి మొలతాడు గొల్లకిట్టయ్య, గంటాగలాసు.. ఇలా మరికొంతమంది గురించి వేరే టపాలో చెప్తాను...!

5 comments:

 1. వంశీ గారి కథల్లోని పాత్రధారుల్ని ఇక్కడ మళ్ళీ చూస్తున్నా.ఎవరో తెలియదు కానీ ఆ ఊరి పేర్లు మాత్రం తెలుసు.మీరిలా పరిచయం చేస్తున్నందుకు ధన్యవాదాలండీ.

  ReplyDelete
 2. మీరు చెప్పింది నిజమేనండీ..వంశీ కధల్లో పాత్రలన్నీ మన చుట్టూ వున్న మనుషులను చూస్తున్నట్లే వుంటాయి..
  ఇంక సువార్త అన్న పేరుకి మీరు ఇచ్చిన వివరణ బాగుంది.
  మొత్తానికి మీ ఊళ్ళోవాళ్ళఊసులు బాగున్నాయి...

  ReplyDelete
 3. @ సుభగారు, రాజిగారు మీకు నా కృతజ్ఞతలు.

  ReplyDelete
 4. ప్రత్యక్ష పరిచయాలన్నమాట మీవి. బాగా రాశారు.

  ReplyDelete
 5. నేను ఎప్పుడన్నా సెలవులకు ఊరెళ్ళినప్పుడు విన్న యాస మళ్లి గుర్తుకు తెచ్చారు. చింతామణి చెట్ని కూడా సుమా చేయటానికి ట్రై చేస్తాను

  ReplyDelete