Thursday 17 November 2011

శోకాల సేద్యాలు

అన్నపూర్ణమ్మ ఒడిలో అన్నదాతను నేను
ఆత్మహత్యల ఖాతాలో అంకెల జాతరనైనాను!


అభివృద్ది మంత్రాలు ప్రకృతిని చెరబడుతుంటే
వరుణుడు ముఖం చాటేస్తున్నాడు..
సూర్యుడు ఎండల పండగ చేసుకుంటున్నాడు
నెర్రలు తీసిన నేలను నైవేద్యంగా తింటూ..


సేద్యానికి పట్టిన చెదపురుగులు
చెమటలు చిందే రెక్కల కష్టాల్ని కొరుక్కుతినేస్తుంటే..
ఆశలు పండవు...అప్పులు తీరవు
ఎండిన చేల ఎక్కిరింపుల మధ్య..
బక్కిచిక్కిపోతున్నాను...బతుకునీడ్చలేకున్నాను


ఆకలి తీర్చే రైతన్నను హారతికర్పూరమైపోతుంటే
దిక్కుతోచక మృత్యువుకు ఆహారమైపోతుంటే
కర్షక  లోగిళ్ళలో శోకాల సేద్యాలే మేటలు వేస్తున్నాయి.


అన్నపూర్ణమ్మ ఒడిలో అన్నదాతను నేను
ఆత్మహత్యల ఖాతాలో అంకెల జాతరనైనాను!

4 comments:

  1. ఆకలి తీర్చే రైతన్నను హారతికర్పూరమైపోతుంటే
    దిక్కుతోచక మృత్యువుకు ఆహారమైపోతుంటే
    కర్షక లోగిళ్ళలో శోకాల సేద్యాలే మేటలు వేస్తున్నాయి. కదిలించిందండీ!

    ReplyDelete
  2. ఆకలి తీర్చే రైతన్నను హారతికర్పూరమైపోతుంటే
    దిక్కుతోచక మృత్యువుకు ఆహారమైపోతుంటే
    కర్షక లోగిళ్ళలో శోకాల సేద్యాలే మేటలు వేస్తున్నాయి.
    కన్నీరు తెప్పించింది.

    ReplyDelete
  3. @ రసజ్ఞగారు, శైలాబాలగారు మీ స్పందనలకు నాకృతజ్ఞతలు.

    ReplyDelete
  4. హ్మ్.. రైతు పరిస్థితిని కళ్ళకి కట్టారు.

    ReplyDelete