Saturday, 26 November 2011

ఐశ్వర్య కూతురు పేరు-పార్ట్2

ఐశ్వర్యరాయ్ కూతురుకి పేరు పెట్టాలన్న అభిషేక్ బచ్చన్ ట్విట్  కి నా మెదడు స్పందించి చివరకు "ఎల్వ, ఎల్లెల్వ" అనే రెండు పేర్లు ఫైనల్ చేసాను. ఆ పేర్లకు తదుపరి   టపాలో వివరణ ఇస్తానని ప్రియమైన బ్లాగరులకు మాటిచ్చాను. కానీ పని ఒత్తిడి వలన ఆలస్యమైపోయింది.మన్నించండి. ఇన్ని రోజులు "ఎల్వ, ఎల్లెల్వ" పేర్లకు వివరణ ఇవ్వలేకపోతున్నానె అనేది ఒక టెన్షన్ అయితే, నేను పేర్లు ఫైనల్ చేసేలోపు 'బేటీ బచ్చన్' కి బచ్చన్ కుటుంబం ఎక్కడ పేరు పెట్టేస్తుందోనని మరో  టెన్షన్... ఏదైతేలెండి "ఎల్వ, ఎల్లెల్వ" పేర్లు అంకురించడం వెనక గల సంఘటనలను మీ ముందుకు తీసుకు వొస్తున్నాను.

"ఎ" అనే అక్షరంతో పాపాయి పేరు ప్రారంభమవ్వాలనేది అభిషేక్ ఇచ్చిన ఒకే ఒక్క కండిషన్. అందుకోసం ముందుగా "ఎ" అనే ఆరంభం కలిగిన పదాలను, పేర్లను గుర్తుకుతెచ్చుకున్నాను...కొంచెం 'క్లూ' గా ఉపయోగపడతాయని.

'అసలు "ఎ" అనే అక్షరాన్నే పేరుగా పెడితే ఎలా వుంటుంది' అని ఒక ఆలోచన వచ్చింది. 'ఛఛ..బాగోదు. ఎందుకంటే "ఎ" అని అనగానే మనవారికి  వెంటనే "అడల్ట్స్ ఓన్లీ" అని అర్ధం వచ్చే "ఎ"  సినిమా సర్టిఫికెట్ తప్ప వేరే యేదీ గుర్తుకురాదు.కాబట్టి "ఎ" అనే అక్షరానికి ఎంత మంచి అర్ధం వున్నప్పటికి ఇక్కడ పనికిరాదు.

'ఎంకమ్మ' అని పెడితే..? బాగానే వుంటుంది..కానీ అది మన రాష్ట్రంలో వుండే ఒక  గ్రామదేవత పేరు అని తెలియని బాలీవుడ్ సినీజనం "ఇది తెలుగు సినిమాలోని పాపులర్ కామెడీ తిట్టు" అని బచ్చన్ కుటుంబానికి ఉప్పందిస్తే? నేను వాళ్ళను మోసం చేసానని అనుకుంటారు. కాబట్టి ఇది కాన్సిల్.

"ఎంకి" అని పేరు పెడితే...ఆహా! సత్తు కారేజ్ లో చద్దన్నం లా చాలా బాగుంది. పైగా 'ఎంకి' పేరుతో మన నండూరివారి అద్భుత సృష్ఠి వుండనే వుంది. ఇంతకంటే మంచి పేరు ఎక్కడ దొరుకుతుంది. ఇదే ఫైనల్ అనుకున్న వెంటనే మళ్ళీ మనసులో మరో భయం..."పంటకాల్వలు, పిల్లగాలులు, వెండి మబ్బులు, పైరు పడుచులు తెలియని వారికి 'ఎంకి' అని పేరు పెట్టి అవమానిస్తావా నీ ఎంకమ్మ" అని నండూరివారికి కోపం వచ్చి నన్ను తిడితే..అమ్మో బాగుండదు..కాన్సిల్.

ఇలా అనుకున్న ప్రతిదానికి ఏదో ఒక సమస్య..
ఎవరెస్ట్ అని పెడితే...? -  "మరో ఐశ్వర్యరాయ్ కావల్సిన అమ్మాయికి పెట్టాల్సిన పేరు నాజూగ్గా వుండాలిగాని పర్వతాలు, గుట్టల పేర్లేమిటి" మనసు ఘోష!

ఎరుపు..ఎకరం..ఎటకారం..ఎవరు..ఎకాడ.. ఇలా ఎన్నో.. ఎన్నో ఆలోచనలు..కానీ ఫలితం శూన్యం. "ఎవరు, ఎకాడ.." కూడా పేర్లేనా అని అడగొద్దు. ఇప్పటి పేర్లకు చాలా మట్టుకు అర్ధం వుండట్లేదుకదా అనేదే నా ధైర్యం.

చివరకు నా ప్రయత్నాన్ని విరమించుకోవాలనే నిర్ణయానికి వచ్చి చివరి ప్రయత్నంగా 'నరసాపురం దగ్గర లచ్చేశ్వరంలో' వుంటున్న నా క్లాస్మేట్ వెంకీ కి ఫోన్ చేసి విషయం చెప్పి సలహా అడిగాను.

"ఏంట్రా! ఎకసెక్కాలా.. ఆ వార్త వచ్చినకాడ్నించి నేను అదే పనిలో వున్నాను. ఎండుచేపలు,ఎండుకొబ్బరికాయలు, ఎలితుమ్మచెట్లు, ఎలక్కాయలు తప్ప నాకు కొత్త పేర్లేమి బుర్రలోకి రావట్లేదు. బుల్లి ఐశ్వర్యకు పేరు పెట్టి క్రెడిట్ కొట్టేయాలని నాకు మాత్రం లేదేంటి.అలాంటి ఐడియా వత్తే ఆ పేరేదో నేనే పెట్టేత్తానుగాని నీకు చెప్తానేంటి..ఎల్లెల్వా" అని ఫోన్ పెట్టేసాడు.

వాడు కోప్పడితే కోప్పడ్డాడు గాని చివర్లో వాడన్న పదం పై నా దృష్టి పడింది. "ఎల్లెల్వా".. ఇది కూడా "ఎ" అనే అక్షరంతోనే ప్రారంభమయ్యింది. దీన్నే కొత్తగా చెబితే.. ఇందులో మొదటి, చివరి అక్షరాలను కలిపితే "ఎల్వ".. ఇంకొంచెం మార్పు చేస్తే.."ఎలెల్వా".హమ్మయ్యా నేను డిసైడ్ ఐపోయాను..ఈ రెండు సెమీఫైనల్..వీటిలో ఒకటి ఫైనల్. ఇక మిగిలింది..."ఎల్వ..ఎలెల్వ" లో ఫైనల్ విజేత ఎవరు? ఇప్పటి పేర్లు పెద్దగా వుంటే పిలిచేంత టైమ్, ఓపిక రెండు జనాలకి వుండట్లేదు కాబట్టి..ఆ రకంగా  నా ఓటు "ఎల్వ" కి వేసాను. అయినా కాని ఎక్కువ శాతం ఓట్లు ఏ పేరుకు పడితే అదే ఫైనల్ పేరు అవుతుంది.
ఈ టపా చదివినవారిలో బచ్చన్ కుటుంబ అభిమానులు, దగ్గరివారు ఎవరైనా వుంటే ఒక వినతి.. మీకు ఈ టపా నచ్చితే నాగురించి వారికి చెప్పండి. నచ్చకపోతే వారి దృష్ఠికి తీసుకెళ్ళకండి.
(సెలబ్రిటీస్ ఇంట్లో ఏంజరిగినా వార్తే అన్నదానికి ఇది సరదా ప్రయత్నం మాత్రమే.. సరదాగా తీస్కోండి)

4 comments:

 1. "ఎరుపు..ఎకరం..ఎటకారం..ఎవరు..ఎకాడ.. ఇలా ఎన్నో.. ఎన్నో
  హహహ...

  ReplyDelete
 2. ఇప్పటి పేర్లకు చాలా మట్టుకు అర్ధం వుండట్లేదుకదా అనేదే నా ధైర్యం. తీవ్రంగా ఖండిస్తున్నా! ఎందుకు ఎడుపు ఎంత ఇవి కూడా పెర్లేనంటారా? హేమిటో? hahaha(సరదాకి)
  ఎంకి నాకెంతో ఇష్టమయిన ప్రణయ నాయిక అందుకే ఒక టపా మొత్తం ఇచ్చా నా బ్లాగులో. కాని ఆ పేరు బచ్చన్ కుటుంబంలో పెట్టకపోవడానికి మీరిచ్చిన వివరణ బాగుంది!

  ReplyDelete
 3. @ కామెంటర్స్ అందరికీ కృతజ్ఞతలు.

  ReplyDelete