Sunday, 11 December 2011

చింతామణి-మా గోపి మాస్టారు

'చిక్కుల్లో చింతామణి' అని టివి9 లో వార్త చూసాను. 'ఈ నాటకం ఒక వర్గం వారిని కించపరిచేలా వుందన్న కారణంగా నాటక  ప్రదర్శనను నిలిపివేయాలని వారు కోరుకుంటున్నారు' అనేది వార్త సారశం. ఇందుకు సంబందించి మిగిలిన విషయాల వైపు వెళ్లకుండా నాకు ఈ వార్త కారణంగా  'చింతామణి' నాటకం గుర్తుచేసిన జ్ఞాపకాల దొంతరలను మాత్రమే ప్రియ బ్లాగరులతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను..!

చింతామణి పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది ఆచంట శివరాత్రి జాతర. మా చిన్నప్పుడు శివరాత్రి ఉత్సవాలకు 'ఆచంట' పెట్టింది పేరు. ప్రతి సంవత్సరం ఐదు రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగేది. మా వరకు ఐతే కాలెండర్ తిరగేస్తు శివరాత్రి ఎప్పుడా అని ఎదురు చూసేవాళ్ళం.

కళ్ళి నాగేశ్వర్రావు కి మహింద్ర ట్రాక్టర్ వుండేది. సాయంత్రం వరకు బంటా పని చేసి (ట్రాక్టర్ తో మట్టి తోలడం లాంటి పనులు) 20 మంది  వరకు కుర్రాళ్ళు  శివరాత్రి రోజు  రాత్రి ఆచంట బయల్దేరేవారు. మేము చిన్నపిల్లలం కాబట్టి ట్రాక్టర్ ట్రక్కులో ఒక మూలన కూర్చునే వాళ్ళం. 

పెనాదం నుండి ఆచంట కు సుమారుగా  పదిహేను కిలోమీటర్ల దూరం వుంటుంది. రాత్రివేళ ప్రయాణం, చుట్టూ దట్టంగా మంచు పట్టేసి ట్రాక్టర్ తోలే డ్రైవర్ కి తప్ప ట్రక్కులో కూర్చున్న వారికి దారి కనిపించేదికాదు. 'గుమ్ములూరు' , 'ఆచంట యేమారం' కి మధ్యలో 'నక్కల కాలవ' అని ఒక పెద్ద కాలవ  వుంది. అది దగ్గరపడుతుందంటే  పిల్లలకే కాదు, పెద్దలకి కూడా భయమే. అక్కడ దెయ్యాలు ఎక్కువగా తిరుగుతాయని, సరిగ్గా వంతెన దాటే సమయంలో కాలవ మధ్యలో వుండగా అవి ఏదో రకంగా ఆ సిమెంట్ వంతెన పై నుండి వెళ్లేవారిని ఇబ్బంది పెడుతూ ఏడిపిస్తాయని కథలు కథలుగా చెప్పుకునేవారు. (నక్కల కాలవ దెయ్యాల కథలను మరో టపాలో వివరంగా చెబుతాను).

ఆచంట రామేశ్వరస్వామి గుడి దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ జాతర చూడడానికి రెండు కళ్ళు సరిపోవంటే నమ్మండి. సాంస్కృతిక కార్యక్రమాలు మొదలవ్వడానికి ఇంకా టైం పడుతుందంటే వేడివేడి జిలేబి, వేడివేడి చికెన్ పకోడి పొట్లం కట్టించుకుని పక్కనే వున్న 'నటరాజ్ దియేటర్'లోనో, 'కళ్యాణ చక్రవర్తి' దియేటర్లోనో సినిమాకి చెక్కెయ్యడం, సరిగ్గా 'చింతామణి' నాటకం మొదలయ్యే సమయానికి బయటకొచ్చెయ్యడం. డ్రామా చూడటంకోసం తాటాకు పందిరి కింద సెటిలై పోవడం. నాటకం మొదలవ్వగానే చూడండి వుంటుంది... తీర్ధంలో అమ్మకానికి తెచ్చిన బూరలన్నీ ఒకేసారి మోగినట్టుగా కుర్రగాలం 'బుయ్...' మని ఊదేవారు. ఒకటే ఈలలు.ఇందులో శ్రీహరి-సుబ్బిశెట్టి మధ్య వచ్చే సంభాషణలకి జనం ఒకటే ఈలలు, చప్పట్లు. వాటి ముందు నేటి వందరోజుల సినిమాలు ఎందుకు పనికిరావంటే అతిశయోక్తి కాదేమో.నాటకంలోని కళాకారులు సందర్భోచితంగా ఆ ఊరి ప్రెసిడెంట్,కర్ణం ఇలా  ఊళ్ళో కొంచెం పేరున్న వ్యక్తులను కూడా వారి నాటకంలో కలిపేసి డైలాగ్స్ అనర్ఘళంగా చెప్పేవారు.అలాంటి సమయంలో సదరు వ్యక్తులు అక్కడ వుండుంటే వెంటనే ఎంతోకొంత కళాకారులకు చదివింపుగా మైక్ లో ప్రకటించేవారు.

ఇక శ్రీహరి పాత్ర ను (చింతామణి తల్లి) మగవారే వేసేవారనే విషయం మొదట్లో నాకు తెలీదు. ఎందుకంటే ఆ మేకప్ లో అచ్చం ఆడవారికి మల్లే ఉండేవారు ఆ పాత్రను దరించే పురుషులు. కొంచెం ఊహ తెలిసిన తర్వాత తెలిసిన నిజం ఏమిటంటే..చింతామణి నాటకంలో శ్రీహరి వేషం వేస్తున్నది ఎవరో కాదు మా బడిలో ఐదవ తరగతి పిల్లలకు పాఠాలు చెప్పడానికి వచ్చిన 'గోపి' మాస్టారేనని. నేను అప్పుడు నాలుగో తరగతిలో వున్నాను.

నేను ఐదవ తరగతిలోకి వచ్చాను. మొదటిసారి 'గోపి' మాస్టారు సోషల్ చెప్పడానికి వచ్చారు. నాకు ఆయన్ని చూస్తుంటే శ్రీహరి, ఆమె కట్టిన గుమ్మడి పూల నీలంరంగు చీర, పొడవాటి జడ, జడ నిండా బుట్టెడు పూలు, ఒంటినిండా నగలు, నడుముకి వడ్డాణం, నాటకంలో వుండే పాత్రధారులతో ఆమె వేసే చతుర్లు..ఇవే గుర్తుకొస్తున్నాయి. క్లాసులో ఏం చెప్తున్నారో తెలీదు. నేనెక్కడో శివరాత్రి జాతరలోకి వెళ్ళిపోయాను. అప్పటికే ఆయన నన్ను గమనిస్తున్నారనే విషయం నాకు తెలియలేదు. నేను ఊహల్లో వుండగానే వాటంగా వున్న పచ్చి 'తూటుకర్ర'తో ఒక్కటిచ్చారు. దెబ్బ తగిలిందని నాకు  తెలియడానికంటే ముందే నాకళ్ళలో నీళ్ళు తిరిగిపోయాయి. "ఏరా..ఏం రోగం? ఇక్కడ పాఠం చెప్తుంటే అక్కడెక్కడో చూత్తున్నావేంటి. నువ్వు రామ్మూర్తిగారి మనవడవు కదూ. రేపొచ్చేటప్పుడు మీ తాతను తీసుకురా మాట్లాడాలి" అని క్లాసులో నుండి బయటకి వెళ్ళిపోయారు. ఆయన వెళ్తున్నప్పుడు కూడా ఆయన నడకలో నాకు అదే ఆడతనం కనిపించి ఏడుపు పోయి నవ్వొచ్చేసింది.

Friday, 9 December 2011

నాటుకోడి స్పెషల్ బిర్యాని


అనగనగా ఒక కోడిపుంజు. దానికి ఎప్పట్నించో 'చికెన్ బిర్యాని' తినాలని బలమైన  కోరిక. కొన్నాళ్ళకి అదుండే ఏరియాకు దగ్గర్లో ఒక బిర్యాని సెంటర్ పుట్టుకొచ్చింది.  ప్రతిరోజు ఆ హొటల్ నుండి బిర్యాని ఘుమఘుమలు ఎక్కువకావడంతో బిర్యాని తినాలనే కోరిక ఇంకా బాగా ఎక్కువైపోయింది.

ఒకరోజు రాత్రి అందరు నిద్రపోగానే  ఎలాగైనా సరే  బిర్యాని రుచి చూడాల్సిందే అని దొంగతనంగా ఆ హొటల్ లో దూరింది కోడిపుంజు. వంటవాళ్ళు, పనివాళ్ళు అందరూ గాఢ నిద్రలో వున్నారు. తన్నితే బిర్యాని బేసిన్ లో పడ్డట్టుగా ఫీలై ఆ ఘుమఘుమలను అస్వాదిస్తూ హొటలంతా కలదిరిగింది. ఒక చోట బిర్యాని పార్సిల్స్ లాటు కనిపించింది. వాటిని పొడుచుకుని తినబోయి బిర్యానీలోకి దమ్స్... వుంటే ఇంకా బాగుంటుందని వెళ్ళి ఒక బాటిల్ తెచ్చుకుంది. సరిగ్గా తినబోయే సమయానికి దాని మెదడులోని సంకేతాలు తొలిఝాము అయ్యిందని హెచ్చరించాయి. అలవాటులో పొరపాటుగా  'పుంజురాజావారు' రెక్కలు టపటపలాడించి, మెడ పైకెత్తి "కొక్కురొక్కో..." అని గట్టిగా కూసింది..అది హొటల్ లో వున్నానన్న సంగతి మర్చిపోయి. దాని కూతకు ఉలిక్కిపడిలేచారు హోటల్ లో పనిచేసే   బిర్యాని బాబులు. డ్యూటీ డిసిప్లిన్ లో పడి తానెంత తప్పు చేసానో తెలుసుకుని నాలుక కరుచుకుంది. కాని అప్పటికే జరగాల్సిన అనర్ధం జరిగిపోయింది.
కట్ చేస్తే..
"ఈరోజు నాటుకోడి స్పెషల్ బిర్యాని" అని బోర్డు మీద రాసిపెట్టారు.
తొలిఝాములో అలారం...తెల్లారేసరికి పలహారం!

Saturday, 3 December 2011

'కార్యేషు దాసుడు'

సికింద్రాబాద్ నుండి పాలకొల్లు వరకు  నర్సాపూర్   express  లో ప్రయాణం చేస్తున్నాను. నాకు మొదట్నించి రిజర్వేషన్ బోగీలో ప్రయాణం చేయడంకంటే జనరల్ బోగీలోనే ప్రయాణం చేయడం ఇష్టం. కొన్నికొన్ని అసౌకర్యాల గురించి మర్చిపోతే అక్కడ వుండే ప్రయాణీకుల్లో రకరకాల మనుషులను, మనస్తత్వాలను, అభిప్రాయాలను దగ్గర నుండి పరిశీలించే అవకాశం వుంటుంది.ఐపాడ్స్, headphones  వచ్చిన తర్వాత రిజర్వేషన్ బోగీలలో ప్రయాణించే ప్రయాణీకుల మధ్య దూరాలు బాగా పెరిగిపోయాయి. పక్క పక్క బెర్త్ లోనే వున్నప్పటికి ఎవరి ప్రపంచం వారిది. లగేజ్ సర్దగానే హెడ్ ఫోన్స్ పెట్టుకుని ట్రైన్ తో పాటుగా పాటలలోకం లో వూగిపోతుంటారు.ఇవన్నీ అదోరకమైన ఒంటరి ప్రయాణాలు...!

జనరల్ బోగీ కావడంతో కొంచెం రద్దీగానే వుంది. కూరగాయల ధరల నుండి కుంభకోణాల వరకు అసలైన ప్రజానీకం సిసలైన కామెంట్స్ చేస్తున్నారు. వీటన్నిటినీ సావధానంగా పరికిస్తున్న నా కళ్ళు కిటికీ దగ్గర వున్న సింగిల్ సీటర్ పై  ఆగిపోయాయి. అక్కడొక అరుదైన దృశ్యం.

ఇద్దరు భార్యాభర్తలు.. చూస్తుంటే ఆమె అనారోగ్యంతో వున్నట్టుగా వుంది. ఆమె ముఖం చూస్తుంటే ఆ విషయం స్పష్టమవుతుంది.మామూలుగా అయితే ఆ సింగిల్ సీట్ లో  తెలియని వారు సైతం  ఇద్దరు సర్దుకుని కూర్చుంటారు .కానీ ఆ సీట్ లో ఆమె ఒక్కదాన్నే కూర్చోబెట్టి, రెండు సీట్ లకు మధ్య లో వుండే ఖాళీ లో  కింద కూర్చున్నాడు ఆ భర్త. నిజానికి ఆ ఖాళీ జాగా కూడా చాలా డిమాండ్ అక్కడ. జనరల్ బోగీలో ప్రయానించే ఎవరికైనా ఈ విషయం అనుభవమే.ఆమె బాగా నీరసంగా కనిపిస్తుంది. అతని కళ్ళలో కూడా కొంచెం ఆందోళన  కనిపిస్తుంది. ఎప్పుడు ఏం అడుగుతుందో అన్నట్టుగా ఆమె కదిలిన ప్రతిసారి ఆ భర్త ఆమెను ఆరాతీస్తున్నాడు 'ఏం కావాలన్నట్టుగా' .

రైలు వేగం అందుకుంది. వేడి వేడి వాదనలు చల్లారిపోయాయి. చాలా మంది నిద్రలోకి జారుకున్నారు. 'నిద్ర సుఖమెరగదు' అన్న విషయం ఇక్కడ సరిగ్గా సరిపోతుంది. ఉన్నంతలో ఎవరికి వారు నిద్రాదేవత ఒడిలో సర్దుకుపోయారు. నాకు సీట్ దొరకలేదు. నేను కూడా కొంత జాగా దొరికితే కిందే చతికిలబడ్డాను. కొంతసేపటికి ఎవరో toilet  తలుపు వేసినట్టు లేదు. దుర్వాసన ఎక్కువగా వస్తుండటంతో లేచి వెళ్ళి తలుపు వేసి ఆ పక్కనే వున్న డోర్ నుండి బయట ప్రపంచాన్ని చూస్తుండిపోయాను.చీకట్లో అన్నీ అస్పష్టంగా కదులుతున్న ఛాయాచిత్రాలే.కొంతసేపటికి 'ఇక చాలు' అనిపించి మళ్ళీ నేను ఇందాక చతికిలబడ్డ చోటుకి వచ్చాను.

అప్రయత్నంగా ఇందాకటి దృశ్యం గుర్తుకొచ్చి ఆ భార్యాభర్తలు  కూర్చున్న వైపు చూసాను. ఈసారి ఇంకా మనోహరమైన దృశ్యం. ఆమె మగతగా నిద్రపోతుంది. కింద కూర్చున్న భర్త ఆమె పాదాలను తన ఒడిలో పెట్టుకుని వాటిని ఒత్తుతు ఆమెకు  సపర్యలు చేస్తున్నాడు నిద్రపోకుండా. భార్య మాట వింటేనే తన పురుషహంకారం ఎక్కడ తగలడిపోతుందో అనుకునే భర్తేశ్వరులు ఇంకా వున్న ఈ లోకంలో, ఆయన చుట్టూ ఎంత మంది వున్నాపట్టించుకోకుండా ఆమె పాదాలు పట్టుకుని సపర్యలు చేస్తున్నాడు.వెంటనే నాకు ఒకసారి ఆఫీస్ లో కొలీగ్స్ మధ్య  చర్చకు వచ్చిన ఒక విషయం గుర్తుకొచ్చింది..

ఇంతకుముందు టీవిలో ఒక యాడ్ వచ్చేది. కార్ చెడిపోవడంతో ఇంటికి నడిచి వచ్చిన తన భార్య పాదాలను ఒడిలో పెట్టుకుని ఆమె అలసట పోగొడుతూ తన ప్రేమను తెలియజేస్తాడు భర్త. కమర్షియల్ గా ఈ వ్యాపార ప్రకటన కంపెనీకి ఎంత లాభం చేకూర్చిందో తెలియదుకాని. నిజానికి ఇది చాలా  అందమైన ఆలోచన.ఈ యాడ్ వచ్చినప్పుడల్లా మా కొలీగ్ వాళ్ళ అత్తగారు 'మరీ చోద్యం కాకపోతే ఇవేం ముదనష్టపు ఆలోచనలే తల్లీ. ఆ మొగుడనేవాడు కాళ్ళు పట్టుకున్నాడే అనుకో ఆ మహాతల్లి రెండు కాళ్ళు ఇచ్చెయ్యడమే. ఒద్దండీ అని వెనక్కి తీస్కోవడం తెలీదు' అని నోరునొక్కుకునేదట. ఈ విషయం మా కొలీగ్ ఆ యాడ్ వచ్చినన్నాళ్ళు ఏదో ఒక సందర్భంలో చెప్తుండేది.
 
ఇప్పుడు రైలు లో అలాంటి భర్త ప్రత్యక్షంగా తారసపడటం నిజంగా ఒక మంచి అనుభవంగా అనిపించింది నాకు. ఇలా భార్యలకు సపర్యలు చేసే భర్తలు ఇంకెవరూ లేరా అంటే.. ఖచ్చితంగా వుండే వుంటారు.. కానీ వారికి గుర్తింపేది. "కార్యేషు దాసీ..కరణేషు మంత్రీ.." అని అన్నీ స్థానాలు ఆడవారికే ఇచ్చేసారు మన పెద్దలు. కాబట్టి ఇలాంటి వారికోసం ఒక చిన్న మార్పుతో.." కార్యేషు దాసుడు.." అని అనుకుందాము...స్త్రీమూర్తులకు అభ్యంతరం లేకపోతే!