Showing posts with label కవితల తీరం. Show all posts
Showing posts with label కవితల తీరం. Show all posts

Saturday, 30 November 2013

జీవితమనే ఫేస్ బుక్ !

నచ్చగానే క్లిక్ కొట్టడానికి అది ఫేస్ బుక్ లో లైక్ కాదు
ఎన్నో నిర్జీవాల మధ్య దేవుడిచ్చిన లైఫ్
నీకు నచ్చినట్టుగా, నలుగురూ మెచ్చేట్టుగా నువ్వే లైన్ చేసుకోవాలి.
షేవింగ్ క్రీమ్ కొనుక్కునే వయసొచ్చినపుడు
షేర్ చేసుకోలేని ఆలోచనలెన్నో వస్తుంటాయి
సేవింగ్స్ లో వేటిని ఉంచాలో, వేటిని తొలగించాలో నువ్వే నిర్ణయించుకోవాలి.
మనం చూసేవన్నీ మన పోస్ట్ లు కాదు
మనం కోరుకునేవన్నీ మన టేస్ట్ లూ కాదు
పరిసరాలు, పరిస్థితులు మనకు తెలియకుండానే వాటిని కోట్ చేసేస్తాయి.
టైమ్ వేస్ట్ చేసుకుంటూపోయి కొన్నాళ్ళకు వెనుతిరిగి చూస్కుంటే
జీవితపు టైమ్ లైన్ పై మన సత్తా ఏమిటో కనిపిస్తుంది
లైఫ్ టైమ్ అఛీవ్మెంటైనా.. లైఫ్ లెస్ ఫనిష్మెంటైనా మనకు మనం ఇచ్చుకునేదే.
విజయ శిఖరంపై నిలబడితే నువ్వు  ప్రెండ్ రిక్వెష్ట్ లు పంపించక్కర్లేదు
జయజయద్వానాలతో నీకు తెలియకుండానే ఫాలోవర్స్ పెరుగుతారు
నీ ముఖపుస్తకం ఖాతా మొత్తం నోటిఫికేషన్స్ తో నిండిపోతుంది.
కామెంట్స్ అనేవి ఎప్పుడూ వుంటూనే ఉంటాయి
పొగడ్తలను తాత్కాలికంగా మార్క్ చేసుకుని
విమర్శలను తర్కంతో కన్ఫర్మ్ చేసుకుని
ఎదిగే కొద్దీ ఒదగడాన్ని ఫేవరెట్ గా మార్చుకుని
సక్సస్ మంత్రాన్ని ప్రొఫైల్ గా రాసుకుని ముందుకు సాగిపో...
జీవితమనే ఫేస్ బుక్! లో సాఫీగా లాగిన్ అవ్వాలంటే...
లక్ష్యం అనే  పాస్ వర్డ్ స్ట్రాంగ్ గా వుండాలని గుర్తుపెట్టుకుంటూ..!

Friday, 22 November 2013

వీడింత మంచోడేంట్రా!

వీడింత మంచోడేంట్రా!
అప్పులోడు కనిపించినట్టుగా అప్పుడప్పుడు కనిపిస్తాం,
నరం లేని నాలుకతో సిగ్గు లేకుండా వాగ్దానాలిచ్చిపోతాం,
ఎన్నికల జాతరలో వాడి నెత్తిన కాలుపెట్టి అందలాలెక్కేస్తాం,
మాటలు తప్పిన కోటల్లో వాడికి సమాధి కడతాం,
కుర్చీలు కదులుతున్నపుడు మాత్రం ఆ సమాధిని తవ్వి...
కుమిలిపోతూ, కుళ్ళిపోతున్న వాడి అస్థిపంజరంతో
మళ్ళీ మన రాజకీయ రంగుల గుడి కట్టుకుంటాం,
ప్రజాసేవ ముసుగులో పంచెకట్టిన జలగలై, నిశీధి గబ్బిలాలై,
పథకాల పేరుతో పొట్టలు పగిలేలా వాడి చెమట చుక్కలు తాగేస్తాం,
ప్రపంచబ్యాంకు కు వీడి తలరాతను తాకట్టు పెట్టి..
స్విస్ బ్యాంకుల్లో పెరుగుతున్న మన కట్టల పాముల్ని లెక్కలు చూసుకుంటాం,
ఎవరెస్టంత ఎదగడంకోసం వీడిని పాతాళానికి తొక్కేస్తున్నా..
కన్నీటికి కరువొచ్చినట్టు ఏడుపుకూడా ఏడవడు...
కోసిన కోతలను, వేసిన మోతలను మోసుకుంటూ వెళ్ళిపోతాడు.
మన బిడ్డల బిర్యానీ కోసం వీడికి ఎంగిలి ఆకులు విదిల్చినా,
అవే ఆకలి తీర్చే అక్షయపాత్రలనుకుంటాడు,
ప్రజాస్వామ్యంలో వున్నానంటూనే వారసత్వ రాచరికానికి పల్లకీ మోస్తాడు,
కూనీలు చేసినా, మోసాలు చేసినా...
బంగాళాఖాతమంత కుంభకోణాలలో అడ్డంగా దొరికిపోయినా...
నా కులపోడనో, మతమోడనో, ప్రాంతమోడనో మన తప్పుల్ని వెనకేసుకొస్తాడు.
మన అక్రమాల పుట్టలు పగిలి మనకే కుళ్ళు కంపు కొడుతున్నా,
ఐదేళ్ల తర్వాత వెళితే అన్నీ మర్చిపోతాడు.
చిల్లర నాణేలు విసిరితే శమంతకమణులనుకుంటాడు,
బిర్యానీ ప్యాకెట్లకు, బీరు సీసాలకు భవిష్యత్తును బలిపీఠం పై పెడతాడు,
గంగిరెద్దులా తలూపుతూ వెళ్ళి అనకొండలకు ఓటేస్తాడు.
వాటి వికృత పడగ నీడలో వాడి తలరాతను వాడే రాసేసుకుంటాడు...మరో ఐదేళ్ళ వరకు.
వీడింత మంచోడెంట్రా?

Saturday, 3 August 2013

మన స్నేహం

వసంతంలో కొత్త చిగురై పుట్టి
గ్రీష్మంలో నీడలా వెన్నంటి
వర్షఋతువులో హర్షమై పలకరించి
శరత్కాలపు వెన్నెలై సేదతీర్చి
హేమంతపు తుషారమై
శిశిరంలో నీవెంటే రాలిపోతాను నేస్తమా...

ఆరుగాలం మన స్నేహం అజరామరం సుమా! 

Thursday, 4 July 2013

తెల్లబోయిన తెల్లగులాబి...

సూరీడు ముద్దబంతిలా ఉదయించాడు

సంద్రంలో తన మొహాన్ని తనే చూసుకుంటూ!

తెలవారిందని ఎవరు చెప్పారో ఆ తెల్లగులాబీకి


ఒళ్ళు విరిచి విచ్చుకుంది


తన ముల్లు తనకు గుచ్చుకోకుండా జాగ్రత్తపడుతు!


వచ్చి పోయేవారిని పలకరించాలని 


నవ్వుల రంగేసుకుని వయ్యారంగా ఊగుతూ


వాలుజడ సుందరి ఓర చూపులో పడింది!


కట్ చేస్తే...


నల్లని కురుల మధ్య తెల్లబోతూ కనిపించింది.


ముల్లు నుంచి తప్పించుకున్నంత సులువు కాదు


ఆడవారి కళ్ళ నుంచి తప్పించుకోవడం – అని 


మదనపడుతూ కూర్చుంది...మగువ సిగలో!

Tuesday, 2 July 2013

ఆమె ఎవరు?

ఆకాశం పందిరి కింద ఆణిముత్యాలు ఏరుకుంటున్నట్టు
మట్టి మంచం పై చెమట చుక్కల కస్తూరి గంధం చిలుకుతున్నట్టు
అవని చెక్కిళ్ళపై మునివేళ్ళతో ముద్దాడుతున్నట్టు
ఆకుపచ్చని రంగుతో పసిడిపంటలకు పురుడు పోస్తున్నట్టు
అన్నపూర్ణమ్మ వాకిట్లో  మెతుకు బిడ్డలను సాకుతున్నట్టు
బిగికట్టిన అర కోకతో...
జడ కుచ్చిళ్ళు మెడవంపున జార్చి
అరుణకిరణాల గొడుగులో
కాయకష్టాల్ని ఆనందంతో ప్రేమిస్తున్న ఆమె ఎవరో కాదు!?
వరినాట్లు వేస్తున్న ఆడపడుచు..
ఆకలి తీర్చే అక్షయపాత్రకు ప్రాణం పోస్తున్న పల్లెపడుచు..!

Tuesday, 28 May 2013

వేసవి పగబట్టింది!

ఆకాశంలో సూర్యుడు ఉగ్రరూపందాల్చినట్టు,
అగ్నిదేవుడు ఆగ్రహంతో రగిలిపోతున్నట్టు,
నిప్పుల కొలిమిలో అభ్యంగస్నానం చేస్తున్నట్టు,
నీడలు సైతం కొవ్వొత్తిలా కరిగిపోతున్నట్టు,
ఒకటే వేడి...!
నీరెండ కూడా నోరుతెరిచి చూస్తుంది
పట్టు చిక్కితే వడదెబ్బ కొట్టి మట్టుపెట్టాలని,
కిరణాల కోరలతో మరణాల పలహారాన్ని ఆరగించేయాలని.
ఈ వేసవి ఎందుకంతగా పగబట్టింది?
ఆకలిమంటతోనా?
కాదు...కాదు కడుపు మంటతో!
ప్రకృతి గర్భంలో పురుడుపోసుకున్న మానవుడు
కాలుష్య జ్వాలలతో కన్నతల్లి కడుపును కాల్చేస్తుంటే
ఆ కన్నపేగు మాత్రం ఎంతవరకు భరిస్తుంది?
అందుకే వేదనను వేడిగాలుల రూపంలో ప్రపంచం పైకి వదిలి
సాంత్వన పొందే ప్రయత్నం చేస్తుంది.

Monday, 28 January 2013

వాన చినుకులు

నల్లని మేఘం గొల్లుమని నవ్వినపుడు...

నింగి రహదారి మీద రెక్కలు లేని పక్షులై

పచ్చని ఆకుల మీద పసిరి అక్షరాలై

కొమ్మ, రెమ్మల మీద కొంటె కోణంగిలై

పూల చెంపలమీద అదరాల ముద్రలై

చిత్తడినేల మీద చిటపటల సరిగమలై

చెరువు నీటి మీద చుక్కల ముగ్గులై

తామరాకుల మీద తప్పెటలాటలై

ముత్యపుచిప్పల కౌగిలిలో పుత్తడిబొమ్మలై

ముత్యాల చినుకులు నేలకు విచ్చేసాయి..

జడివాన ఉయ్యాలలో మనసును లాలించాయి!

Wednesday, 2 January 2013

లంకెబిందువులు



కొమ్మ మాటిమాటికి ఊగుతుంది..
తన పిందెల బరువు చూసుకుని మురిసిపోతూ!
                    ***

చలిచీకటి మంచు దుప్పటి కప్పుకుంది..
తెల్లని ముసుగులో నిద్రపోవాలని కోరుకుంటూ ! 
                    ***
గులాబీ ఒళ్ళు విరిచి విచ్చుకుంది..
తన ముల్లు తనకు గుచ్చుకోకుండా జాగ్రత్తపడుతూ!
                         ***
అలలు ఒడ్డుకు చేరుతున్నాయి..
కొలనులో చేపల చక్కిలిగింతలకు పారిపోతూ!