Sunday, 13 November 2011

వెర్రివెంగళ్ పాటగోల

వెంగళ్ళప్ప గారాల కొడుకు 'వెర్రి వెంగళ్'. వాడు నిద్రపోవాలంటే ఖచ్చితంగా పాటపాడాల్సిందే. కొద్దిరోజులు వచ్చిరాని పాటలు పాడి వెర్రివెంగళ్ ని నిద్రపుచ్చిన వెంగళ్ళప్ప దీనికి ప్రత్యామ్నాయంగా FM ని నమ్ముకున్నాడు. ఒక్కసారి దానిని ఆన్ చేసి వదిలేస్తె అందులో వచ్చే పాటను వింటూ నిద్రలోకి జారిపోతాడు వెర్రివెంగళ్. రాత్రి ఏం జరిగిందంటే వస్తూవస్తూ షడన్ గా పాట ఆగిపోయింది. వెర్రివెంగళ్ కి మెలుకువ వచ్చేసింది. వాడు 'పాటకావాలి' అని ఒకటే ఏడుపు.
ఇంతవరకు అలాంటి పరిస్తితిని ఎదుర్కోని వెర్రివెంగళప్ప 'ఒక్క నిమిషం వెంగళ్' అని వాడిని ఒళ్ళోపెట్టుకుని లాలిస్తు రేడియో విప్పి చూసాడు.అందులో ఒక బొద్దింక చచ్చిపోయి వుంది. దానిని బయటకు తీసి 'అయ్యో...ఇదా సంగతీ' అన్నాడు.
'ఏమయ్యింది డాడి' అని అడిగాడు వెర్రివెంగళ్
'సింగర్ చచ్చిపోయింది వెంగళ్' అని విచారంగా అన్నాడు.
'లోపలొక ఆంబులెన్స్ పెట్టుంటే అది బతికేదేమో. ఆ.. నువెప్పుడు ఇంతే..అన్నీ నేనే చెప్పాలి' అంటూ ఏడుపు అందుకున్నాడు వెర్రివెంగళ్.

* ఆధారం : రాత్రి నా చరవాణికి ఒక స్నేహితుడు పంపించిన సంక్షిప్తసందేశం.

"దూకుడు" రికార్డ్స్ ని మించిన రికార్డ్

బ్లాగు చరిత్రలో ఆల్ టైమ్ రికార్డ్. నాకు తెలిసి ఇప్పటి వరకు జరగనిది.. ఇక ముందు కూడా జరగని సెన్సేషనల్ రికార్డ్ ఇదే..ఇదే..ఇదే.. ఈ నా బ్లాగ్ రికార్డ్ ముందు మహేశ్ 'దూకుడు' రికార్డ్స్ ఏరకంగా చూసినా సరిపోవు. బ్లాగరుల్లో ఎవరికైనా 'గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్' వారితో పరిచయం వుంటే వెంటనే ఈ విషయం వారి చెవిలో వేసి నా బ్లాగ్ చరిత్రపుటల్లో వుండేలా మీ వంతు సాయం చేయండి.
అంతర్జాల వీక్షకులలో ఎవరికైనా మీడియా వారితో పరిచయం వుంటే వెంటనే 'పగిలిపోతున్న వార్త' రూపంలో టీవీ లలో వచ్చి ప్రపంచమంతా 'న్యూసై' కూసేలా చేయండి. ఇంకా ఇలా ఏఏ రూపాలలో ఈ సంచలన రికార్డ్ ని జనం ముందు వుంచాలో అన్ని రూపాలలో వుంచడానికి నా శ్రేయోభిలాషులందరు  తలో దిక్కుకు పరుగులు తీయండి.
'ఇంతకీ ఆ రికార్డ్ ఏంటంటారా..? అయ్యో ఇంతకీ నేను విషయం చెప్పకుండానే ఈ హడావిడి చేస్తున్నాన. క్షమించండి.. ఇంతకీ ఆ వార్త ఏంటంటే..'నిన్ననే ప్రారంభించిన నా బ్లాగు... పట్టుమని పది టపాలు కూడా లేని నాబ్లాగు...ఉదయానికి కేవలం 23 హిట్స్ తో వున్న నా బ్లాగు.. ఇప్పుడు చూసేటప్పటికి నాలుగు లక్షల హిట్స్ దాటి ఐదు లక్షల వైపు పరుగులు పెడుతుంది. ఇంతకంటే గొప్ప రికార్డ్, ఆల్ టైమ్ రికార్డ్, బ్లాగ్ ఆఫీస్ రికార్డ్ ఇంకేముంటుంది.ఋజువు కావాలంటే నాబ్లాగుకు ఎడమవైపున, పైభాగంలో వున్న హిట్ కౌంటర్ చూడండి.
"..ఈ దూకుడు..." అదిగో ఎవరో సందర్భానికి తగ్గ పాట ప్లే చేస్తున్నారు. "సాటెవ్వరు"...


గమనిక : ఇలాంటి వింత జరగడానికి కారణం ఏమయ్యుంటుందో తెలిస్తే చెప్పగలరు. కలికాలం అని మాత్రం తప్పించుకోకండి.

Saturday, 12 November 2011

నా పేరేంటో

అనగనగా ఒక ఈగ. ఆ ఈగ మందుకొడుతూ తన పేరు మర్చిపోయింది.తన పేరు ఏమయ్యుంటుందా అని ఎంత ప్రయత్నించినా ఫుల్ బాటిల్ అయిపోయింది గాని పేరుమాత్రం గుర్తురాలేదు.మత్తు తలకెక్కి కంట్రోల్ తప్పుతున్నా 'స్టడీ..స్టడీ' అనుకుంటూ తన పేరు తెలుసుకునే ప్రయత్నం చేసింది ఈగ. ముందుగా అక్కడ వైన్ షాప్ పక్కనున్న బజ్జీ బండివాడ్ని 'అబ్బాయ్ అబ్బాయ్ పేరేంటో చెప్పవా?' అని అడిగింది.
'బ్రేకింగ్ న్యూస్ బాబూరావ్' అన్నాడు.
'బ్రేకింగ్ న్యూస్ బాబూరావా?' ఎవరి పేరది? 
'నాపేరు'
'నీపేరు నాకెందుకు నాపేరు కావాలి..సరేగాని నీ పేరు 'బ్రేకింగ్ న్యూస్ బాబూరావ్' అన్నావుకదా..ఏదీ ఓక బ్రేకింగ్ న్యూస్ చెప్పు?'
'మందుకొట్టి పేరు మర్చిపోయిన  ఈగ'
'ఆ..మందుకొట్టి పేరు మర్చిపోయిన  ఈగ'. మందుకొట్టింది నేనే.. పేరు మర్చిపోయింది నేనే.. అంటే నాపేరు ఈగన్నమాట...స్టడీ స్టడీ నాపేరు ఈగ'  అంటూ మళ్ళీ మందుకొట్టడానికి వెళ్ళిపోయింది ఈగ.